Advertisement

తెలంగాణలో హంగ్ వస్తే అధికారం ఎవరిది?


తెలంగాణలో గంట గంటకూ రాజకీయ సమీకరణలు మారిపోతున్నాయి. వరుస ఎదురుదెబ్బలతో ‘కారు’ పార్టీ పంచర్లతో విలవిల లాడుతుండగా.. నేతల వలసలతో కాంగ్రెస్ యమా జోష్.. అంతకుమించి జోరు మీద ఉంది. ఇక బీజేపీ అయితే.. గతంలో వచ్చిన సీట్లయినా వస్తే చాలు మహాప్రభో అని అనుకుంటోంది. అటు అధికార బీఆర్ఎస్.. ఇటు బీజేపీ పార్టీల నుంచి నేతలు గుడ్ బై చెప్పేసి.. హస్తం గూటికి చేరిపోతున్నారు. ఇక పార్టీ గెలిచేసింది.. ప్రమాణ స్వీకారమే తరువాయి అన్నట్లుగా కాంగ్రెస్ సీన్ క్రియేట్ చేస్తోంది. దీనికి తోడు పలు సర్వేలు సైతం కాంగ్రెస్‌దే హవా.. ఆరు నూరైనా అధికారం హస్తందేనని తేల్చిచెబుతున్నాయి. మరికొన్ని సర్వేల్లో అబ్బే.. బీఆర్ఎస్ హ్యాట్రిక్ కొట్టబోతోంది.. ఇందులో ఎలాంటి సందేహాలు అక్కర్లేదని క్లియర్‌ కట్‌గా చెప్పేశాయి. ఇంకొన్ని సర్వేలయితే పక్కాగా బీఆర్ఎస్-కాంగ్రెస్ మధ్య హోరా హోరీ తప్పదని.. హంగ్ వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదని చెబుతున్నాయి. ఒకవేళ ఆ సర్వేల ప్రకారం హంగ్ వస్తే పరిస్థితేంటి..? అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది.

Advertisement

సారు.. కారు.. సర్కారు అంతే!

ఈ ఎన్నికల్లో హంగ్ వచ్చినప్పటికీ తప్పకుండా అధికారంలో వచ్చేది బీఆర్ఎస్ పార్టీయేనని తేలిపోయింది. ఇది జరిగితేనే సారు కారు పార్టీకి అడ్వాంటేజ్ అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్న మాట. ఎందుకంటే.. బీజేపీతో కాంగ్రెస్ కలవదు.. అలాగనీ ఎంఐఎంతోనూ అస్సలు అయ్యేపని కాదు. ఇప్పుడు ఎలాగో బీఆర్ఎస్‌-ఎంఐఎం కలిసే ఉన్నాయి కాబట్టి కచ్చితంగా మజ్లిస్ మద్ధతు కారు పార్టీకే ఉంటుంది. ఎందుకంటే.. ఆ రెండు పార్టీల మధ్య సత్సంబంధాలు అలా ఉన్నాయ్. ఎలాంటి తోపులు, తురుములు నిల్చున్నా సరే హైదరాబాద్‌లో ఏడు స్థానాలు మజ్లిస్ పార్టీవే. ఇంకొక స్థానం పెరుగుతుందేమో కానీ.. తగ్గే ప్రసక్తయితే అస్సలు లేదు. 2014, 2018 ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు కలిసే అధికారాన్ని దక్కించుకున్నాయి. ఒకరితో ఒకరు పొత్తు లేదు కానీ.. సవ్యంగానే ముందుకెళ్తున్నాయి. అధికారంలోకి వచ్చిన ప్రతిసారీ కీలక పదవులు అన్నీ మజ్లిస్ నేతలకు ఇస్తున్నారు కేసీఆర్. ఈసారి కూడా ఇదే రిపీట్ అవుతుంది.. ఎంఐఎం కావాల్సిందల్లా గులాబీ బాస్ కాదనకుండా ఇచ్చేస్తారు గనుక.. వారితో ఎలాంటి విబేధాలు అక్కర్లేదు.. అంతకుమించి కాంగ్రెస్ వైపు వెళ్లాల్సిన అవసరమూ లేదు.

అస్సలు లేనే లేదుగా!

వాస్తవానికి తెలుగు రాష్ట్రాల్లో ఇంతవరకూ హంగ్ వచ్చిన  పరిస్థితులు అస్సలు లేవు.. ఇకపైన రాకపోవచ్చు కూడా. ఎందుకంటే తెలుగు ప్రజలు ఎటు ఉన్నా.. క్లియర్ కట్‌గా ఓట్లేసి సీట్లు ఇస్తూ వస్తుంటారు.. అందుకే ఇలాంటి పరిస్థితి రాలేదు. కాకపోతే ఈసారి వచ్చే పరిస్థితులు ఉంటాయని మాత్రం కొన్ని సర్వే సంస్థలు.. అదేదో ఉందే తొందరపడి ఓ కోయిల అన్నట్లుగా కూసేస్తున్నాయి. ఇది ఎంతవరకు నిజం అవుతుందో తెలియట్లేదు కానీ.. వస్తే మాత్రం బీఆర్ఎస్‌దే అధికారమని మాత్రం స్పష్టంగా తేలిపోయింది. మరోవైపు.. ఈ నెల మొదటి వారంలో తెలంగాణకు వచ్చిన బీజేపీ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్.. హంగ్ ఏర్పడితే అధికారంలోకి వచ్చేది కమలం పార్టీయేనని బల్ల గుద్ది మరీ చెప్పారు. అంతేకాదు.. ఏ పార్టీకి ఓటేసినా పడేది కమలం గుర్తుకే అని ఎంపీ ధర్మపురి అర్వింద్ లాంటి వారు చెబుతున్నారు. అంతేకాదు.. హంగ్ వస్తే ఏం చేయాలనేదానిపై ఇప్పటికే ఢిల్లీలోని బీజేపీ పెద్దలతో చర్చలు కూడా సాగుతున్న పరిస్థితి. గెలుపు,అధికారం సంగతి దేవుడెరుగు కానీ ఇప్పటి వరకూ సరిగ్గా అభ్యర్థులను ప్రకటించలేని పరిస్థితి కమలదళంలో ఉండటం గమనార్హం. కాంగ్రెస్‌లోనూ ఇంచుమించు ఇదే సీన్. అయితే హస్తం మాత్రం హంగ్ వస్తే.. అటు బీఆర్ఎస్ నుంచి.. ఇటు బీజేపీ నుంచి కొందర్నీ లాగేయాలనే వ్యూహంలో కూడా ఉందట. అయితే.. బీఆర్ఎస్‌కు మాత్రం ఇన్ని కష్టాలు అక్కర్లేదు.. యథావిధిగా మజ్లిస్‌ మద్ధతు కోరితే హ్యాట్రిక్ కొట్టేసినట్లే. హంగ్ ఏ మేరకు వస్తుందో.. చివరి నిమిషంలో ఏం జరుగుతోందో.. మున్ముందు ఇంకా ఎన్నెన్ని పరిణామాలు చోటుచేసుకుంటాయో.. చూద్దాం మరి.

If there is a Hung in Telangana, who is the Rule?:

There Will Be Hung in Telangana For Upcoming Elections
Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement