క్రికెట్ వరల్డ్ కప్ 2023లో భాగంగా ఆదివారం న్యూజిలాండ్, భారత్ జట్ల మధ్య జరిగిన పోరులో ఇండియా 4 వికెట్ల తేడాతో విజయాన్ని సాధించి పాయింట్స్ టేబుల్‌లో అగ్రస్థానానికి చేరింది. ఇప్పటి వరకు అపజయమనేది లేకుండా ఆడిన అన్ని మ్యాచ్‌లలో విజయం సాధించి.. పాయింట్స్ టేబుల్‌లో నెంబర్ 1 స్థానానికి చేరింది. ముందు అనుకున్నట్లుగా ఆదివారం మ్యాచ్.. భారత్‌కు పరీక్షలానే సాగింది. 274 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ ఆరంభంలో బాగానే ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. ముఖ్యంగా రోహిత్ శర్మ(46) తన ఫామ్‌ని కొనసాగిస్తూ.. ఫోర్లు, సిక్సర్లతో కివీస్‌పై చెలరేగాడు. అయితే హాఫ్ సెంచరీకి చేరువైన సమయంలో అనూహ్యంగా బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత కాసేపటికే మరో ఓపెనర్ గిల్ (26) అవుట్ అయ్యాడు. ఓపెనర్స్ ఇద్దరినీ కివీస్ బౌలర్ ఫెర్గ్యూసన్ అవుట్ చేసి.. భారత్‌ను ఒత్తిడికి గురిచేశాడు.
అయితే రెండు వికెట్లు పడిన ఆనందాన్ని కివీస్‌కు లేకుండా చేశారు కింగ్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్. వీరిద్దరూ హాఫ్ సెంచరీ భాగస్వామ్యం అనంతరం శ్రేయస్ అయ్యర్ (33) అవుట్ అయ్యాడు. కోహ్లీ మాత్రం సహనంగా ఆడుతూ.. మధ్య మధ్యలో ఫోర్లు కొడుతూ స్కోర్ బోర్డుని పరుగులు పెట్టించాడు. కోహ్లీకి జతగా రాహుల్ కూడా తనదైన షాట్స్‌తో కాసేపు అలరించాడు. వీరు కూడా హాఫ్ సెంచరీ భాగస్వామ్యం చేశాక.. కె.ఎల్. రాహుల్ (27) శాంట్నర్ బౌలింగ్‌లో ఎల్‌బిడబ్ల్యూగా వెనుదిరిగాడు. అనంతరం వచ్చిన సూర్యకుమార్ యాదవ్ కూడా ఎక్కువ సేపు క్రీజ్‌లో ఉండలేకపోయాడు. సూర్యకుమార్ (2) రనౌట్ అయ్యాడు. దీంతో ఒక్కసారిగా భారత్ అభిమానులు షాక్‌కి గురయ్యారు. ఒకానొక దశలో ఇండియా గెలుస్తుందా? అనుకునే పరిస్థితి నెలకొంది.
కానీ కింగ్ కోహ్లీ క్రీజ్‌లో ఉన్నంత సేపు విజయానికి ఢోకా లేదు అనేది మరోసారి నిరూపించాడు. జడేజాతో కలిసి మరోసారి హాఫ్ సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పిన కోహ్లీ.. వరుసగా మరో సెంచరీ చేసి సచిన్ రికార్డును సమం చేస్తాడని అనుకున్న సమయంలో అనూహ్యంగా 96 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. ఇంకా విజయానికి 5 పరుగులు అవసరం ఉండగా.. షమీతో కలిసి జడేజా (39) విన్నింగ్ షాట్‌తో భారత్ మ్యాచ్‌ని లాంచనంగా ముగించాడు. దీంతో వరుస విజయాలతో దూసుకెళుతున్న న్యూజిలాండ్ దూకుడుకు బ్రేక్ పడింది. అలాగే ప్రపంచకప్‌లో న్యూజిలాండ్‌పై ఉన్న చెత్త రికార్డ్‌కు కూడా తెరపడింది. ఈ విజయంతో వరుసగా 5 విజయాలతో 10 పాయింట్స్ సాధించి.. పాయింట్స్ పట్టికలో భారత్ అగ్ర స్థానానికి చేరింది.