తెలంగాణ ఎన్నికల మజాకా? కేవలం షెడ్యూల్ వచ్చింది అంతే. వందల కోట్లు చేతులు మారుతున్నాయి. నిజంగానే ఇది షాక్ ఇచ్చే విషయమే. ఇంకా పూర్తి స్థాయిలో పోలీసులు రంగంలోకి దిగితే ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా భద్రతను పోలీసు యంత్రాంగం కట్టుదిట్టం చేసినప్పటికీ ఇంకా పూర్తి స్థాయిలో పోలీసులు విధుల్లోకి దిగలేదు. అయినా కూడా డబ్బులు కోట్లలో లభ్యమవుతున్నాయి. ఇక బంగారం, వెండి అయితే కిలోల కొద్దీ దొరుకుతోంది. మరి ఇంత పెద్ద మొత్తంలో దొరుకుతున్న డబ్బు, బంగారం ఏ పార్టీ వారిదనేది చర్చనీయాంశంగా మారింది.
ఇంకా అభ్యర్థుల ఎంపిక కూడా పూర్తి స్థాయిలో జరగనేలేదు. ఈ స్థాయిలో డబ్బు వరద పారడమనేది ఆసక్తికరంగా మారింది. హైదరాబాద్ జంట నగరాలతో పాటు జిల్లా బోర్డర్లు, పట్టణాలు మొదలు గ్రామ సరిహద్దుల వరకూ చెక్‌పోస్టులను ఏర్పాటు చేసి అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ తనిఖీల్లో కోట్లలో డబ్బు బయటపడుతోంది. ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చిన రోజే హైదరాబాద్‌లోని కవాడీగూడలో రూ.10 కోట్ల డబ్బు, 16 కిలోల బంగారం, వెండి పట్టుబడటం గమనార్హం. అలాగే కరీంనగర్‌లో ఓ వాహనంలో రూ.2 కోట్ల డబ్బు లభ్యమైంది. కాగజ్‌నగర్‌లో రూ.99 లక్షలు.. నల్గొండ జిల్లాలో అయితే ఇప్పటి వరకూ రూ.8 కోట్లను అధికారులు సీజ్ చేశారు.
ఇక మద్యం మాత్రం ఏమైనా తక్కువా? గత వారం రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా 3 కోట్ల విలువైన మద్యాన్ని అధికారులు సీజ్ చేశారు. అసలు ఇప్పటి వరకూ పట్టుబడిన డబ్బు, బంగారం, మద్యం విలువ ఎంతో తెలుసా? ఏకంగా రూ.101 కోట్లు. ఇప్పుడే ఇంత పట్టుబడితే ఇంకా నాలుగు రోజులు పోతే నామినేషన్ల పర్వం మొదలవుతుంది. అక్కడి నుంచి అసలు సినిమా స్టార్ట్. తాగినోడికి తాగినంత.. లాగినోడికి లాగినంత డబ్బు. అవసరమైతే బంగారం కూడా పంపిణీ చేస్తారు. ఇక ఈ రేంజ్‌లో చేతులు మారుతున్న డబ్బు ఏ పార్టీకి చెందినదనే విషయం మాత్రం తెలియడం లేదు. అధికార బీఆర్ఎస్ పార్టీదని కొందరంటున్నారు. బీజేపీ పెద్దలు పంపిస్తున్నారని కొందరు.. కాదు కాదు.. కాంగ్రెస్ పార్టీదని మరికొందరు. ఎవరిదైతేనేం కానీ ఈసారి తెలంగాణలో ఎన్నికలు మాత్రం పూర్తి స్థాయిలో మందు, విందు, డబ్బుపైనే నడుస్తాయనడంలో సందేహం లేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.