ప్రస్తుతం జరుగుతున్న క్రికెట్ ప్రపంచకప్‌లో భారత్ ఆడిన మూడు మ్యాచ్‌లలోనూ విజయం సాధించి, పాయింట్స్ టేబుల్‌లో అగ్రస్థానంలో కొనసాగుతోంది. భారత్‌తో పాటు అపజయమనేది లేకుండా న్యూజిలాండ్ కూడా 6 పాయింట్స్‌తో అగ్రస్థానంలోనే ఉంది. రన్‌రేట్ ప్రకారం భారత్ మొదటి స్థానంలో ఉండగా, రెండో స్థానంలో న్యూజిలాండ్ ఉంది. ఇప్పటి వరకు భారత్ ఆటగాళ్లు.. ఆడిన 3 మ్యాచ్‌లలో కూడా సునాయాసంగానే విజయాన్ని అందుకున్నారు. కానీ వారికి అసలు సిసలైన పరీక్ష ముందు ముందు ఎదురు కాబోతోంది. అదెలా అనుకుంటున్నారా?
భారత్ ఆడే తదుపరి మ్యాచ్ బంగ్లాదేశ్‌తో ఉండబోతోంది. ఈ మ్యాచ్ గురించి భారత్ టీమ్, అభిమానులు అంతగా ఆలోచించాల్సిన అవసరం లేదు. బంగ్లాదేశ్‌తో జరగబోయే మ్యాచ్ విషయంలో టీమిండియా ఆటగాళ్లు ఓ ప్లానింగ్‌తో ఉంటారు కాబట్టి.. భారత్‌కే విజయావకాశం ఉంది. అయితే ఆ మ్యాచ్ అనంతరం టీమిండియాకు అసలైన అగ్నిపరీక్ష ఎదురు కానుంది. వరుస విజయాలతో దూసుకుపోతున్న న్యూజిలాండ్, సౌత్ ఆఫ్రికాలతో పాటు ఆప్ఘాన్‌పై ఓడిపోయి కసి మీద ఇంగ్లండ్ జట్టులను భారత్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఈ మూడు మ్యాచ్‌లే భారత్‌కు కీలకం కానున్నాయి. ఈ జట్లపై పోటీకి రోహిత్ సేన ఎలా సన్నద్ధమవుతుందనేదే ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
అయితే కెప్టెన్ రోహిత్, కోహ్లీ, శ్రేయస్, కె.ఎల్. రాహుల్ వంటి ఆటగాళ్లు మంచి ఫామ్‌లో ఉండటంతో పాటు శుభ్ మన్ గిల్ తిరిగి జట్టులోకి చేరడంతో భారత్ టీమ్ పటిష్టంగా కనిపిస్తోంది. అలాగే బౌలర్స్ కూడా మంచి ఫామ్‌లో ఉండటం అనేది భారత్‌కు కలిసొచ్చే అంశం. ఇంకా స్వదేశంలో ఈ మ్యాచ్‌లు జరుగుతుండటం కూడా భారత్‌కు ప్లస్ పాయింట్. అయితే.. ఎన్ని ప్లస్‌లు ఉన్నా, ఎన్ని మైనస్‌లు ఉన్నా.. బరిలో ఉన్నప్పుడు రోహిత్ తీసుకునే నిర్ణయాలే జట్టును విజయతీరానికి చేర్చాలి కాబట్టి.. బలమైన జట్లను ఎదుర్కొనే సమయంలో రోహిత్ ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో చూడాల్సి ఉంది.