టీడీపీ అధినేత చంద్రబాబుతో ములాఖత్ అనంతరం జనసేన అధినేత పొత్తు ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఆ తరువాత ఏపీ సీఎం జగన్‌కు కూడా గట్టి సవాల్ విసిరారు. అప్పటి నుంచి మొదలు ఎక్కడలేని అక్కసునంతా కూడగట్టి మరీ వైసీపీ నేతలు ఈ పార్టీల పొత్తుపై గుమ్మరిస్తున్నాయి. ఆ రెండు పార్టీల అధినేతల మధ్య ఏం జరిగిందనే విషయం అయితే బయటకు రాలేదు. కానీ వారిద్దరూ మంచి అండర్ స్టాండింగ్‌తోనే ముందుకు వెళుతున్నారు. కానీ వైసీపీ నేతలకు వచ్చింది నొప్పంతా. వారిద్దరి మధ్య సీట్ల పంపకం తేలలేదని.. అన్ని సీట్లే ఇస్తారని.. అన్నే ఇస్తే జనసేన నేతలకు చాలా కష్టమవుతుందని అది ఇది అంటూ నొప్పులు పడుతున్నారు.
జనసేనకు ఇచ్చే సీట్లు ఎన్నో ఇంకా లెక్క తేలలేదని.. కేవలం 25కు మించి సీట్లు ఇచ్చేది లేదని టీడీపీ లీకులు ఇచ్చిందని ప్రచారం నిర్వహిస్తున్నారు. లీకులు ఇచ్చిందా? లేదంటే జనాన్ని తప్పుదోవ పట్టించడానికి ఊహాజనిత ప్రచారాన్ని చేస్తున్నారా? ఒకవేళ లీకులు కేవలం వైసీపీ నేతలకే టీడీపీ ఇచ్చిందా? పోనీ సీట్ల పంపకం గురించి మాట్లాడాలని జనసేన అధినేతకు తెలియదు. ఆమాత్రం తెలియకుండానే రాష్ట్ర రాజకీయాల్లో పవన్ కీలక పాత్ర పోషిస్తున్నారా? టీడీపీ ఇచ్చిన లీకులే నిజమైతే జనసేన రాజకీయ భవిష్యత్ ఏంటనేది పవన్‌కల్యాణ్ తేల్చుకోవాల్సి ఉంటుందని వైసీపీ ఆవేదన వ్యక్తం చేస్తోంది. కందకు లేని దురద కత్తిపీటకెందుకని.. జనసేనకు లేని బాధ వైసీపీకి ఎందుకో అర్థం కావడం లేదు.
మరో ఆసక్తికర విషయం ఏంటంటే.. పొత్తు ప్రకటన తర్వాత పవన్‌ను టీడీపీ దేఖడం లేదట. ఎవరు ఎవరిని చూస్తున్నారనే దానిపై వైసీపీ ఏమైనా స్వయంగా కొందరు నేతల్ని నియమించిందా.. ఏంటి? దీనికి కారణంగా టీడీపీతో సమన్వయం కోసం ఐదుగురితో కూడిన కమిటీని పవన్ ప్రకటించారు అని చెబుతోంది. మరి టీడీపీ కూడా ప్రకటించింది కదా. ఇక్కడి నుంచి మరింత అక్కసు వెళ్లగక్కుతోంది వైసీపీ. ముందు సీట్ల లెక్క తేల్చుకోవాలి కదా.. అది లేకుండా సమన్వయ కమిటీలేంటి? అంటోంది. వాళ్లిష్టం. ఏమైనా చేసుకుంటారు. పైగా పొత్తు ఇరు పార్టీలకు ప్రయోజనం కలిగేలా ఉండాలంటూ సన్నాయి నొక్కులు. మరి ఇరు పార్టీలకు ప్రయోజనం ఉండదు అనుకుంటే ఏ పార్టీ అయినా పొత్తుకు ఎందుకు వెళుతుంది? వైసీపీ నేతలు మరీ ఓవర్‌గా ఫీలై పోయి జనసేన నేతలు బాధపడతారంటూ వీళ్లే తెగ బాధపడిపోతున్నారు.