అప్పట్లో అయితే అభ్యర్థులను ప్రకటించేసి.. తాంబూలాలిచ్చేశాం.. తన్నుకు చావండి అన్నారు గులాబీ బాస్ కేసీఆర్. ఇప్పుడు అదే మాట మీద నిలబడతారా? లేదంటే రూట్ మారుస్తారా? ప్రకటించిన 115 మంది అభ్యర్థుల్లో ఒకరు పార్టీ మారారు. మరి 114 మంది బీఫామ్ ఇస్తారా? లేదంటే తూచ్ అనేస్తారా? అనేది సందేహంగా మారింది. నిన్న మొన్నటి వరకూ అంటే బీఫామ్ ఇవ్వకుంటే జంప్ అయ్యేవారేమో.. కానీ కాంగ్రెస్ పార్టీ చాలా వరకూ తన అభ్యర్థుల జాబితాను ప్రకటించేసింది. బీజేపీ కూడా ఇదే బాటలో పయనిస్తోంది. రేపో మాపో అభ్యర్థుల జాబితాను ప్రకటించనుంది.
ఇక కేసీఆర్ బీఫామ్ ఇవ్వను పోండి అన్నా కూడా సదరు అభ్యర్థులు చేయగలిగిందేమీ లేదు. అయితే అసలు ఈ సందేహమెందుకు వచ్చింది.. అంటారా? బీఆర్ఎస్ పార్టీ 51 బీఫామ్స్ మాత్రమే సిద్ధంగా ఉన్నాయని, మిగతావి సిద్ధమవుతాయని అని కేసీఆర్ తెలిపారు. అభ్యర్థుల జాబితాను దాదాపు పూర్తి స్థాయిలో ప్రకటించినప్పుడు బీఫామ్స్ మాత్రం సగమే సిద్ధం చేయడమేంటి? మిగతా వాటి విషయంలో ఏమైనా బీఆర్ఎస్ అధిష్టానం ఆచి తూచి వ్యవహరిస్తోందా? అనేది చర్చనీయాంశంగా మారింది. పైగా అన్ని పార్టీల కంటే ముందుగానే.. షెడ్యూల్ రావడానికి దాదాపు 50 రోజుల ముందే అంటే ఆగస్ట్ 21 బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల జాబితాను వెలువరించింది.
50 రోజుల తర్వాత కూడా సగమే బీఫామ్స్ సిద్ధంగా ఉన్నాయని చెప్పడమేంటి? గులాబీ బాస్ మాటలతో పార్టీ అభ్యర్థుల గుండెల్లో మామూలు రైళ్లు కాదు.. ఏకంగా శతాబ్ది ఎక్స్‌ప్రెస్ పరిగెడుతోంది. అసంతృప్తులు బయటకు వెళ్లకుండా ముందుగానే అభ్యర్థుల జాబితాను ప్రకటించేసి.. బీఫామ్స్ ఇవ్వకుండా గులాబీ బాస్ తాత్సారం చేశారని అంటున్నారు. నిన్న మొన్నటి వరకూ జాబితాలో పేర్లు లేని నేతలు ఆందోళనకు గురైతే ఇప్పుడు పేర్లున్న నేతలు సైతం అంతకు మించి ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే పేరు లేని నేతలు ఉండటమా? జంప్ చేయడమా? అనే విషయం ఆలోచించి నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు వీరికి నిర్ణయం తీసుకునేందుకు కూడా సమయం లేదు. మొత్తానికి గులాబీ బాస్ వ్యూహానికి సలాం కొట్టాల్సిందే.