తెలంగాణ సీఎం కేసీఆర్‌ను అపర చాణక్యుడు అంటారు. ఆయన రాజకీయాల్లో ఆరితేరి పోయారు. తెలంగాణ ఎన్నికల షెడ్యూల్ రాకముందే అభ్యర్థుల పేర్లను ప్రకటించి పెద్ద సాహసమే చేశారు. పార్టీని వీడే వాళ్లుంటే ఉండండి అన్నట్టుగా ఒక పరోక్ష సవాల్ అయితే విసిరారు. బీజేపీ, కాంగ్రెస్‌లు అయితే ఇప్పటికీ అభ్యర్థుల జాబితా ఊసే లేదు. కానీ కేసీఆర్ జాబితా ప్రకటించేసి సైలెంట్ అయిపోయారు. ఆ తరువాత ఆయనకు ఏవో అనారోగ్య సమస్యలు తలెత్తాయని ఆయన తనయుడు, మంత్రి కేటీఆర్ ఆంగ్ల మీడియాకు వెల్లడించారు. దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద చర్చే నడిచింది. అసలు అభ్యర్థుల ప్రకటన అనంతరం కేసీఆర్ మీడియా ముందుకు వచ్చిందే లేదు.
ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారనే అంతా అనుకున్నారు. కానీ సైలెంట్‌గా విజయానికి అవసరమైన స్కెచ్ గీసేశారు. కాంగ్రెస్ పార్టీ బహిరంగంగా ఆపరేషన్ ఆకర్ష్ చేపడితే బీఆర్ఎస్ పార్టీ మెల్లగా చాపకింద నీరులా ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ క్రమంలోనే పలు దఫాలుగా బీఆర్ఎస్ నేతలను కాంగ్రెస్ పార్టీ మాజీ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్యను పార్టీలోకి లాగేసింది. ఇక చిన్న చితకా నేతలందరినీ పార్టీలోకి లాగేసుకుంది. వీరి ద్వారా క్షేత్ర స్థాయిలో బీఆర్ఎస్ బలోపేతానికి ట్రై చేస్తున్నారు. అసలు నిజానికి కేసీఆర్ సైలెంట్ అయిపోయారంటే కాంగ్రెస్, బీజేపీలు ఎంత యాక్టివ్ అవ్వాలి? ఎంత యాక్షన్ ప్లాన్ రచించాలి? అదేమీ లేదు. అసలు ఆ దిశగా ఆలోచనే లేదు.
అభ్యర్థుల ఎంపికలో ఈ రెండు పార్టీలు హస్తిన చుట్టూ తిరగడానికే సమయం అంతా వెచ్చించాయి. వరుసబెట్టి స్క్రీనింగ్ కమిటీ సమావేశాలు.. అన్ని అవసరమా? పోనీ ఇన్ని చేసి అభ్యర్థుల జాబితా విడుదల చేశారా? అంటే అదీ లేదు. నేడు అమావాస్య కాబట్టి రేపటి నుంచి ఎప్పుడైనా విడుదల చేయవచ్చు. ఇది బీఆర్ఎస్‌కు బాగా కలిసొచ్చింది. ఈ సమయాన్ని బీఆర్ఎస్ చక్కగా సద్వినియోగం చేసుకుంది. నేతలకు వల వేసి లాగేసింది. పైగా మిగిలిన నాలుగు స్థానాలు, అలాగే మేనిఫెస్టో విషయంలో ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఈసారి గులాబీ బాస్ తన మేనిఫెస్టోలో మహిళలను టార్గెట్ చేస్తున్నట్టు టాక్. మహిళలపైనే వరాలన్నీ గుప్పించేలా ఉన్నారు. మరి ఇప్పటికే ఉద్యోగులు, విద్యార్థుల్లో తీవ్ర వ్యతిరేకత అయితే ఉంది. మరి దానికి కేసీఆర్ అనుకూలంగా ఎలా మార్చుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.