తెలంగాణలో ఎన్నికల వేడి మామూలుగా లేదు. టికెట్ వచ్చిన వారిది ఒక గోల. రాని వారిది మరో గోల. మొత్తానికి చకచకా జంపింగ్స్ అయితే అవుతున్నాయ్. కాంగ్రెస్ పార్టీలో సీనియర్స్ ఎక్కువ. ఒకప్పుడంటే ఓ వెలుగు వెలిగారు. ఎప్పటికే అలాగే ఉండాలంటే ఎలా? పాత నీరు పోతేనే కదా.. కొత్త నీరు వస్తుంది. ఒకవైపు వి.హనుమంతరావు... మరోవైపు పొన్నాల లక్ష్మయ్య. ఇద్దరూ ఇద్దరే ఎలక్షన్ స్టార్స్. అప్పుడంటే వారి హవా నడిచింది. ఆ సమయంలో పెద్ద పెద్ద పదవులే కాంగ్రెస్ పార్టీ కట్టబెట్టింది. ఇప్పటికీ అలాగే ఉండాలంటే ఎలా? అందుకే కాంగ్రెస్ పార్టీ ససేమిరా అంది.. వీళ్లు సైడ్ అయిపోతున్నారు. ఇప్పటికే పొన్నాల రాజీనామా ప్రకటించారు. వీహెచ్ బెదిరింపులకు పాల్పడుతున్నారు.
ఇక పొన్నాలకు బీఆర్ఎస్ అధిష్టానం నుంచి ఏదో అభయం వచ్చింది కాబట్టి ఆయన రిజైన్ చేశారని టాక్. జనగామ అసెంబ్లీ టికెట్‌ను పొన్నాల ఆశించారు. కానీ కాంగ్రెస్ పార్టీ ఈసారి సీనియారిటీ గీనియారిటీ జాన్తా నై.. కేవలం గెలుపు గుర్రాలకే సీటు అని తేల్చి చెప్పింది. ఈ క్రమంలోనే పొన్నాలకు హ్యాండ్ ఇచ్చింది. అయితే బీఆర్ఎస్ మాత్రం అక్కడ పల్లా రాజేశ్వర్ రెడ్డిని కాదని పొన్నాలకు టికెట్ ఇస్తారా? అనేది చర్చనీయాంశంగా మారింది. ఆ పార్టీ మాత్రం గెలుపు అవకాశాలను చూసుకోదా? అయితే బీసీ ఓటు బ్యాంకు కోసం పల్లాను పక్కనబెట్టి పొన్నాలకు టికెట్ కేటాయిస్తుందని అంటున్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నుంచి జనగామ పల్లాదేనంటూ లీకులు అయితే బయటకు వచ్చాయి.
ఇక పొన్నాల పార్టీని వీడితూ.. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మీద, తెలంగాణ కాంగ్రెస్‌లో జరుగుతున్న పరిణామాల మీద తీవ్ర ఆరోపణలు చేస్తూ ఘాటు లేఖ రాసి అధిష్టానానికి పంపారు. మరి ఇన్ని ఆరోపణలు చేసిన తర్వాత పొన్నాలకు కాంగ్రెస్‌కు తిరిగి వద్దామనుకున్నా గేట్స్ క్లోజ్ అవుతాయి. పొన్నాల ఇంటికి వెళ్లి మరీ కేటీఆర్.. బీఆర్ఎస్‌లోకి ఆహ్వానించినట్లు తెలుస్తోంది. దీంతో ఆయన పార్టీ జంప్ అయ్యేందుకు సిద్ధమయ్యారు. మరి బీఆర్ఎస్ కూడా టికెట్ కేటాయించమంటే ఏం చేస్తారు? అనేది ప్రశ్నార్థకంగా మారింది. నిన్న మొన్నటి వరకూ జనగామలో సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి వర్సెస్ పల్లా మధ్య వార్ నడిచింది. ఈసారి ముత్తిరెడ్డికి టికెట్ ఇవ్వమనేసరికి ఆయన కూడా పార్టీ మారే ఆలోచన చేశారు. దీంతో ముత్తిరెడ్డికి ఆర్టీసీ చైర్మన్ బాధ్యతలు అప్పగించి పల్లాతో హరీష్ రావు సయోధ్య కుదిర్చారు. పల్లా కోసం ముత్తిరెడ్డినే తప్పించిన అధిష్టానం పొన్నాలకు టికెట్ కేటాయిస్తుందా? డౌటే.. మొత్తానికి పొన్నాల రెంటికి చెడ్డ రేవడి అయ్యే అవకాశాలే స్పష్టంగా కనిపిస్తున్నాయి.