ఏపీని మూడు పార్టులుగా విభజిస్తే.. ఒక పార్ట్ మినహా రెండు పార్టుల్లో పార్టీ బలంగానే ఉంది. నిజానికి రాయలసీమలో అనంతపురం జిల్లా అయితే టీడీపీకి అడ్డా. కానీ ఎందుకో గత ఎన్నికల్లో అక్కడ కూడా బొక్కబోర్లా పడింది. 2014లో 14 సీట్లకు గానూ.. 12 చోట్ల విజయం సాధిస్తే.. గత ఎన్నికల్లో మాత్రం బాగా దెబ్బతిన్నది. ఇక గత ఎన్నికల్లో నిజానికి ఉత్తరాంధ్రలో కూడా పరిస్థితి పెద్దగా అనుకూలంగా లేదు కానీ ఇప్పుడు మాత్రం బాగా మెరుగుపడిందని తెలుగు తమ్ముళ్లు భావిస్తున్నారు. వైజాగ్‌ను పరిపాలన రాజధాని చేస్తానని ఏపీ సీఎం జగన్ ప్రకటించారు. ఈ విషయంలో ఆయన చాలా పట్టుదలగా ఉన్నారు.
అయినా కూడా క్షేత్ర స్థాయిలో అయితే ఆ పార్టీకి ఉత్తరాంధ్రలో మైలేజ్ అయితే రావడం లేదు. స్వప్రయోజనాల కోసమే జగన్ ఇదంతా చేస్తున్నారని ఉత్తరాంధ్ర ప్రజలు భావిస్తున్నారు. ఇక ఇప్పుడు టీడీపీకి జనసేన కూడా తోడవుతోంది కాబట్టి ఉత్తరాంధ్రలో తిరుగుండదనే భావనలో తెలుగు తమ్ముళ్లు ఉన్నారు. ఇక కృష్ణా, గుంటూరు జిల్లాలు అయితే టీడీపీకి అడ్డా. గత ఎన్నికల్లో కాస్త పరిస్థితులు అనుకూలించలేదు కానీ ఈసారి మాత్రం బాగానే ఉంది. ఏ విధంగా చూసినా కూడా పార్టీని బలోపేతం చేసుకోవాల్సింది ఒక్క రాయలసీమలోనే అని టీడీపీ నేతలు భావిస్తున్నారు. ఈ ఒక్క రాయలసీమలో కూడా టీడీపీ మెజారిటీ సీట్లు సాధించగలిగితే ఇక తిరుగుండదని భావిస్తోంది.
ఈ క్రమంలోనే సీమలో సమస్యలపై టీడీపీ ఫోకస్ పెడుతోంది. సాగు, తాగునీటితో పాటు ఇతర సమస్యలపై దృష్టి పెడుతోంది. అలాగే సిద్ధేశ్వరం అలుగు ప్రాజెక్టు నిర్మాణంతో సీమ బతుకు మారుతుందని బొజ్జా దశరథరామిరెడ్డి కొంత కాలంగా పోరాటం చేస్తున్నారు. ఆయనకు టికెట్ ఇస్తే ఎలా ఉంటుందనే యోచనలో టీడీపీ ఉందని సమాచారం.అలాగే సీమలోని పలు సమస్యలపై పోరాడుతున్న వారిని అక్కున చేర్చుకోవాలని భావిస్తోందట. ఈసారి అధికారంలోకి సీమాంధ్రకు ఉపయోగపడేలా ప్రాజెక్టుల నిర్మాణం చేపడతామని టీడీపీ హామీ ఇస్తోంది. మొత్తానికి చాపకింద నీరులా మెల్లమెల్లగా రాయలసీమలో పాగా వేసేందుకు ఆపరేషన్ రాయలసీమను సైటెంట్‌గా టీడీపీ స్టార్ట్ చేసినట్టు తెలుస్తోంది.