జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీపై ఆసక్తికర చర్చ సాగుతోంది. ఆయన తిరుపతి నుంచి బరిలోకి దిగబోతున్నట్టు టాక్ నడుస్తోంది. గత ఎన్నికల విషయానికి వస్తే.. పవన్ గాజువాక, భీమవరం నుంచి పోటీ చేసి రెండు చోట్లా ఓటమి పాలైన విషయం తెలిసిందే. అయినా కూడా ఆయన ఎప్పుడూ రాజకీయాల నుంచి తప్పుకునే ఆలోచన చేయలేదు. ఇక ఈసారి ఎన్నికలకు తనతో పాటు తన పార్టీని ఆయన సర్వసన్నద్ధం చేసుకున్నారు. మరో ఆరు నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయి. పార్టీలన్నింటికీ ఈ ఆరునెలలే కీలకం. ముఖ్యంగా చంద్రబాబు అరెస్ట్ తర్వాత ఏపీ రాజకీయాల్లో ఓ ఊపొచ్చింది. ఈ క్రమంలోనే టీడీపీతో పవన్ పొత్తు ప్రకటన చేశారు.
ఇక ప్రస్తుతం పవన్ కల్యాణ్ తిరుపతి నుంచి పోటీ చేయాలని భావిస్తున్నట్టు సమాచారం. గతంలో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని తిరుపతి నుంచే ప్రకటించారు. అలాగే అక్కడి నుంచే ఆయన పోటీ చేసి విజయం సాధించారు. ఈ క్రమంలోనే ఈసారి తాను కూడా తిరుపతి నుంచి పోటీ చేయాలని పవన్ భావిస్తున్నట్టు సమాచారం. ఇది చంద్రబాబు సూచన మేరకే చేస్తున్నారని కొందరు.. ఆయనే నిర్ణయం తీసుకున్నారని మరికొందరు అంటున్నారు. నిజానికి చిత్తూరులో బలిజ సామాజిక వర్గం ఎక్కువ. ఇది పవన్‌కు అనుకూలంగా మారుతుందని చంద్రబాబు అంచనా వేశారని అందుకే పవన్‌ను అక్కడి నుంచి పోటీ చేయాలని సూచించినట్టు సమాచారం.
రాయలసీమలో కడపతోపాటు చిత్తూరులో వైసీపీ బలంగా ఉంది. ఈ క్రమంలోనే పవన్ తిరుపతి నుంచి పోటీ చేస్తే.. చిత్తూరు వైసీపీ ప్రాబల్యాన్ని తగ్గించవచ్చని టీడీపీ అధినేత భావిస్తున్నారట. మరోవైపు పవన్‌తో పాటు నాగబాబు సైతం మదనపల్లి, శ్రీకాళహస్తి స్థానాలను పరిశీలిస్తున్నారట. దీంతో టీడీపీ నేతల్లో కలవరం మొదలైందని తెలుస్తోంది. పొత్తులో భాగంగా తాము పోటీ చేసే స్థానాలు ఎక్కడ జనసేనకు పోతాయోనని నేతలు ఆందోళన చెందుతున్నారట. బలిజ కులస్తులు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాలపైనే నాగబాబు సైతం ఫోకస్ చేసినట్టు తెలుస్తోంది. అంతేకాకుండా పవన్‌తో పాటు జనసేన కేడర్‌పై ఇష్టానుసారంగా నోరు పారేసుకుంటున్న మంత్రి రోజాను టార్గెట్ చేయాలని పార్టీ కేడర్ నాగబాబుపై ఒత్తిడి తెచ్చిందనే చర్చ జరుగుతోంది. ఈ ప్రచారంలో నిజమెంతనేది మరికొద్ది రోజులు ఆగితే కానీ క్లారిటీ రాదు.