తెలంగాణ సీఎం కేసీఆర్ బాటలోనే ఏపీ సీఎం జగన్ నడవబోతున్నట్టు టాక్ నడుస్తోంది. తెలంగాణలో ఐదారుగురు మినహా సిట్టింగ్ ఎమ్మెల్యేలకే టికెట్లు కేటాయిస్తూ కేసీఆర్ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు జగన్ కూడా సిట్టింగ్‌లకు ఎక్కువ టికెట్లు కేటాయించబోతున్నారని సమాచారం. ఏపీలో గత ఎన్నికల్లో వైసీపీ 151 అసెంబ్లీ స్థానాలను గెలుచుకుంది. ఇప్పుడు ఆ పార్టీలో ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి లేరు. టీడీపీలోకి జంప్ చేశారు. వీరి స్థానాల్లో కొత్తవారికి జగన్ అవకాశం ఇవ్వనున్నారు.
ఇక పేర్ని నాని, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి వంటి కొందరు ఈసారి ఎన్నికల బరి నుంచి తాము తప్పుకుంటామని.. తమ వారసులకు అవకాశం కల్పించాలని కోరుతున్నారట. దీనికి జగన్ అంగీకరిస్తే వారి స్థానంలో కొత్తగా వారసులు వచ్చి చేరుతారు. అలాగే.. టీడీపీ నుంచి వైసీపీకి వచ్చిన వల్లభనేని వంశీ, జనసేన నుంచి విజయం సాధించి వైసీపీకి మద్దతుగా ఉన్న రాపాక వంటి వారికి జగన్ టికెట్లు కేటాయించనున్నారు. ఇకపోతే.. రఘురామ కృష్ణంరాజు వైసీపీకి రెబల్‌గా ఉన్నారు. ఆయన వైసీపీతో ప్రతిపక్షం కంటే ధీటుగా పోరాడుతున్నారు. ఆయన స్థానంలో ఎంపీ రేసులో కొత్తవారిని వైసీపీ దింపనుంది.
ఇకపోతే.. వంగా గీత, ఆదాల ప్రభాకర్ రెడ్డి, మార్గాని భరత్ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, చింతా అనురాధ వంటి కొందరు ఎంపీలను అసెంబ్లీ బరిలో దింపాలని జగన్ యోచిస్తున్నారట. అలాగే గత ఎన్నికల్లో అసెంబ్లీ బరిలో నిలిచిన బొత్స సత్యనారాయణ, కురసాల కన్నబాబు, తమ్మినేని సీతారాం, ధర్మాన ప్రసాద రావు, ఆళ్ల నాని, అనిల్ కుమార్ యాదవ్ వంటి వారిని పార్లమెంటుకు పంపాలని యోచిస్తన్నారట. ఈ స్థానాల్లో మార్పులుంటాయి. అలాగే సర్వేలను బట్టి ఏమాత్రం గెలిచే అవకాశం లేని నేతలను సైతం ఈసారి జగన్ పక్కనబెట్టే అవకాశం కనిపిస్తోంది. ఇక ఈ స్థానాలు మినహా మిగిలిన అన్ని స్థానాల్లోనూ సిట్టింగ్‌లకే జగన్ అసెంబ్లీ టికెట్ కేటాయించనున్నారట. మొత్తానికి జగన్ ప్రభుత్వం అయితే ఈసారి వ్యూహాత్మకంగా ముందుకు వెళుతోంది.