కొన్ని సార్లు.. సామాన్య జనానికి సైతం తమ రాష్ట్రంలో ఏం జరుగుతుందనేది క్లియర్‌గా అవగతమవుతూనే ఉంటుంది. అంతేకాదు.. అధికార పక్షం ఎవరిని ఎక్కువగా టార్గెట్ చేస్తే.. అదే ప్రత్యర్థి పార్టీ అనడంలో సందేహమే లేదు. ప్రత్యర్థి పార్టీ అనడానికి మరో రుజువు ఏంటంటే.. వలసలు. ఏ పార్టీలోకి వలసలు. కానీ కొన్ని సర్వేలు మాత్రం రాష్ట్రంలో జరుగుతున్న దానికి పొంతన లేకుండా ఉంటాయి. తాజాగా తెలంగాణలో ఓ సర్వే సంస్థ ఫలితాలను వెలువరించింది. మూడో స్థానానికి పడిపోయిందని తెలంగాణలో చిన్న పిల్లాడిని అడిగినా చెప్పే పార్టీని తీసుకొచ్చి బీఆర్ఎస్‌కు ప్రత్యర్థిని చేసింది. ప్రస్తుతం ఈ సర్వే తెలంగాణలో హాట్ టాపిక్‌గా మారింది.
ఎన్నికల వేళ తెలంగాణ రాజకీయం ఆసక్తిని రేకెత్తిస్తోంది. పార్టీలన్నీ త్వరలో రాబోయే ఎన్నికలపై ఫోకస్ పెట్టాయి. ఈ క్రమంలోనే సర్వేలు సైతం ఊపందుకుంటున్నాయి.
ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే తెలంగాణలో విజయం ఎవరిది అన్న దానిపై తాజాగా ఇండియా టీవీ, సీఎన్ఎక్స్ ఒపీనియన్ పోల్ నిర్వహించాయి. ఈ పోల్‌లో వెలువరించిన విషయాలు నిజంగానే ముక్కున వేలేసుకునేలా ఉన్నాయి. ఈసారి ఎన్నికల్లో పక్కాగా బీఆర్ఎస్ పార్టీయే విజయం సాధిస్తుందని సర్వే తేల్చింది. గతంతో పోలిస్తే సీట్లు తగ్గొచ్చేమో కానీ విజయం మాత్రం గులాబీ పార్టీదేనట. ఇంతవరకూ బాగానే ఉంది కానీ తెలంగాణలో రెండో స్థానంలో బీజేపీని పెట్టడమే కాస్తంత విడ్డూరంగా ఉంది.
ఇండియా టీవీ, సీఎన్ఎక్స్ ఒపీనియన్ పోల్ ప్రకారం.. తెలంగాణలో ఈసారి బీఆర్‌ఎస్‌కు 40 శాతం ఓట్లు.. బీజేపీకి 28 శాతం ఓట్లు.. కాంగ్రెస్ 23 శాతం ఓట్లు వస్తాయట. రెండో స్థానంలో బీజేపీ, మూడో స్థానంలో కాంగ్రెస్ నిలుస్తుందట. ఇక లోక్‌సభ అయితే బీఆర్‌ఎస్‌కు 8 సీట్లు, బీజేపీ 6 సీట్లు, కాంగ్రెస్ 2 సీట్లు దక్కించుకుంటాయని సర్వే తేల్చింది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి వచ్చినన్ని లోక్‌సభ సీట్లు(3) కూడా ఈసారి రావని సర్వే తేల్చింది. పైగా బీజేపీకి గతంలో 4 రాగా.. ఇప్పుడు 6కి పెరుగుతాయట. ఇక ఎంఐఎం ఎప్పటిలాగే తన స్థానాన్ని తాను నిలబెట్టుకుంటుందట. బీజేపీకి గతంలో గెలిచినా స్థానాల్లో ఏ ఒక్కటీ దక్కకపోవచ్చంటూ టాక్ నడుస్తుంటే.. ఇప్పుడు కొత్తగా ఈ సర్వే ఇలా చెబుతోందేంటంటూ జనం విస్తుబోతున్నారు.