విక్టరీ వెంకటేష్ నటిస్తోన్న ల్యాండ్ మార్క్ 75వ చిత్రం సైంధవ్ రిలీజ్ డేట్ ఫిక్సయింది. ఇప్పటి వరకు ఈ సినిమా డిసెంబర్‌లో విడుదలవుతుందని మేకర్స్ చెబుతూ వచ్చినప్పటికీ, డిసెంబర్‌కి ప్రభాస్ సలార్ వచ్చేయడంతో.. వెంకీ తన సినిమాని వాయిదా వేసుకోక తప్పలేదు. అయితే వాయిదా వేసుకున్నా.. ఏదైనా మంచి డేట్ చూసుకుని వస్తాడని అనుకుంటే.. సంక్రాంతి బరిలో దిగేందుకే సై అంటున్నారు. అవును.. సైంధవ్ కూడా సంక్రాంతికి వచ్చేందుకే సిద్ధమయ్యాడు. తాజాగా మేకర్స్ విడుదల తేదీని కూడా ప్రకటించారు.
సైంధవ్ 13 జనవరి, 2024న విడుదల కాబోతున్నట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. దీంతో సంక్రాంతి లిస్ట్‌లోకి మరో సినిమా వచ్చి చేరింది. ఇప్పటికే అదిగో ఇదిగో అని దాదాపు అరడజనుకు పైగా సినిమాలు సంక్రాంతి బరిలో ఉండగా.. ఇప్పుడు వెంకీ సైంధవ్ కూడా చేరడంతో పొంగల్ ఫైట్ మరింత ఆసక్తికరంగా మారింది. అసలు ఇన్ని సినిమాలకు థియేటర్లు ఎలా అడ్జస్ట్ చేస్తారనేది చూడాల్సి ఉంది.
సైంధవ్ విషయానికి వస్తే.. హిట్ వర్స్ ఫేమ్ శైలేష్ కొలను దర్సకత్వంలో నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్‌పై వెంకట్ బోయనపల్లి ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాని రూపొందిస్తున్నారు. యూనిక్ యాక్షన్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది. తాజాగా మేకర్స్ పండుగకు ఒక రోజు ముందు సైంధవ్ రాబోతున్నాడని తెలుపుతూ ఓ పోస్టర్‌ని విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో వెంకటేష్, బేబీ సారాతో కనిపించారు. వెంకటేష్‌కు సంక్రాంతి మోస్ట్ సక్సెస్ ఫుల్ సీజన్ అనే విషయం తెలియంది కాదు. ప్రస్తుతం సైంధవ్ షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ఈ సినిమాను అన్ని దక్షిణాది భాషలతో పాటు హిందీలోనూ విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.