కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాష్ట్ర పర్యటనకు వస్తే.. కలవనీయకుండా రాష్ట్ర అధినాయకత్వం మోకాలు అడ్డుపెట్టింది. ఇక అంతే.. అప్పటి నుంచి ప్రధాని మోదీయే ఏకంగా రెండు సార్లు రాష్ట్రానికి వచ్చినా కూడా ముఖ్య నేతలు డుమ్మా కొడుతూ వస్తున్నారు. ఇప్పటికే రహస్యంగా సమావేశమైన ఆ నేతలంతా జంపింగ్‌కు సిద్ధమవుతున్నారని టాక్. ఈ క్రమంలోనే ఏకంగా మోదీ సభకే గైర్హజరవడంతో జంప్ ఫిక్స్ అయినట్టేనని ప్రచారం జరుగుతోంది. అసలే తెలంగాణలో ఈసారి పార్టీ కుప్పకూలుతుందని టాక్ బీభత్సంగానే నడుస్తోంది. గతంలో గెలుచుకున్న స్థానాలను సైతం ఈసారి గెలుచుకోవడం కష్టమేనట.
అలాంటిది ఉన్న నేతలు సైతం జంప్ చేస్తే పరిస్థితి ఏంటి? అనేది ఆసక్తికరంగా మారింది. ప్రధాని మోదీ రెండు పర్యాయాలు తెలంగాణకు వచ్చారు. ఈసారి తెలంగాణలో పాగా వేస్తామన్న నమ్మకం ఇంకా ఉందో ఏమో కానీ.. మరోసారి పసుపు బోర్డు ప్రకటన చేశారు. ఈ క్రమంలోనే మొన్న పాలమూరు సభకు మాజీ ఎంపీలు విజయశాంతి, కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి, ఏనుగు రవీందర్ రెడ్డి దూరంగా ఉన్నారు. నిన్న జరిగిన నిజామాబాద్ సభకు సైతం వీరంతా దూరం. మరోవైపు ప్రధాని మోదీ తెలంగాణకు వస్తుంటే.. మాజీ ఎంపీ వివేక్ మాత్రం హస్తినను వీడలేదు. ఇప్పుడు కీలక నేతలే మోదీ సభకు డుమ్మా కొట్టడం బీజేపీలో హాట్ టాపిక్‌గా మారింది.
రాములమ్మ అయితే ట్విటర్ వేదికగా.. బీజేపీపై పరోక్ష విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక వీరంతా కూడా నేరుగా విమర్శలు చేయకున్నా.. కూడా తెర వెనుక వ్యవహారం బాగానే నడిపిస్తున్నారని టాక్. ఇప్పటికే వీరంతా పక్క పార్టీల వైపు చూస్తున్నారట. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, వివేక్, కొండా విశ్వేశ్వరరెడ్డి కాంగ్రెస్ వైపు చూస్తున్నారని టాక్. మరి మిగిలిన నేతలు కూడా జై కాంగ్రెస్ అంటారో లేదంటే జై బీఆర్ఎస్ అంటారో చూడాలి. మొత్తానికి తెలంగాణలో బీజేపీ అయితే నేలమట్టమవడం ఖాయమని టాక్ నడుస్తోంది. బండి సంజయ్ సహా మరొకరు లేదంటే ఇద్దరు మినహా బీజేపీ తరుఫున ఎవరూ గెలిచే అవకాశమే లేదంటున్నారు. కనీసం కాంగ్రెస్ పార్టీ అయినా ఓ మేనిఫెస్టో.. అభ్యర్థుల జాబితా అంటూ హడావుడి చేస్తోంది. బీజేపీ మాత్రం దిక్కూ దివాణం లేని నావలా పయనిస్తోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.