సినిమాలైనా.. రాజకీయాలకైనా సెంటిమెంట్లు చాలా ఎక్కువ. ఏం చేయాలన్నా సెంటిమెంటు చూసుకోవడం సర్వసాధారణం. తెలంగాణ సీఎం కేసీఆర్ అయితే ఈ విషయంలో ముందుంటారు. ప్రతిదానికి సెంటిమెంటు పక్కాగా చూసుకుంటారు. కానీ కొందరికి కొన్ని నెలలు కలిసి రావు. ఆ సమయంలో ఏ పని చేయరు. టీడీపీకి గత చాలాకాలంగా ఆగస్ట్ అస్సలు కలిసి రావడం లేదు. ఇది ఈ నాటి టెన్షన్ కాదు... ఎన్టీఆర్ హయాం నుంచి ఇదే పరిస్థితి. అప్పటి నుంచి కూడా ఆగస్ట్ వచ్చిందంటే చాలు.. టీడీపీ నేతలు ఏ కొత్త పనులకు కూడా శ్రీకారం చుట్టరు. ఒకరకమైన టెన్షన్ అనేది వారిలోఉంటుంది. ఇప్పుడు ఆ నెలకు సెప్టెంబర్, అక్టోబర్ కూడా తోడైంది.
1984 ఆగస్టు 15న ఎన్టీఆర్‌పై నాదెండ్ల భాస్కరరావు తిరుగుబాటు చేశారు. ఆ తరువాత 11 ఏళ్లకు అంటే..1995 ఆగస్టులో లక్ష్మీపార్వతి జోక్యం అధికమవడంతో పార్టీని కాపాడేందుకు రంగంలోకి దిగిన చంద్రబాబు అదే ఎన్టీఆర్‌పై తిరుగుబాటు చేసి పార్టీని హస్తగతం చేసుకున్నారు. ఇవి రెండు మాత్రమే కాదు.. ఆగస్ట్ టీడీపీ చాలా సంక్షోభాలకు నెలవు. సంవత్సరం మారినా కూడా ఇదే నెలలో చాలా మంది కీలక నేతలు పార్టీలకు దూరమవడం.. వంటివి జరిగాయి. ఇక ఆ తరువాత అక్టోబర్ సంక్షోభం. ఉమ్మడి ఏపీ సీఎంగా ఉన్న చంద్రబాబు 2003 అక్టోబర్ 1న తిరుపతి వెళ్లారు. అలిపిరి టోల్ గేట్ సమీపంలో నక్సలైట్ల బాంబు దాడిలో తీవ్రంగా గాయపడ్డారు.
ఇక ఇప్పుడు ఆగస్ట్, అక్టోబర్‌లకు తోడు సెప్టెంబర్ కూడా యాడ్ అయ్యింది. ప్రస్తుతం సెప్టెంబర్ సంక్షోభం వెంటాడుతోంది. పార్టీ అధినేత చంద్రబాబు అరెస్ట్ అయింది సెప్టెంబర్ నెలలోనే అన్న విషయం తెలిసిందే. ఆయన కుమారుడు లోకేశ్‌తో పాటు.. పార్టీ కీలక నాయకులంతా వరుసన కేసుల బారిన పడ్డారు. చంద్రబాబును జైలుకు పంపించాలని అప్పట్లో వైఎస్ రాజశేఖర రెడ్డి తీవ్రంగా కృషి చేశారు. కానీ కుదరలేదు. ఇప్పుడు కూడా చంద్రబాబు అరెస్టు అవుతారని కూడా ఎవరూ ఊహించలేదు. కేవలం విచారణ ముగించుకుని బయటకు వస్తారనుకుంటే.. ఏకంగా రిమాండ్.. జైలుకు వెళ్లి వారాలు దాడుతున్నాయ్. మొత్తానికి ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ మూడు నెలలు టీడీపీకి చీకటి రోజులనే మిగులుస్తున్నాయి.