వైనాట్ 175.. గత కొంతకాలంగా ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నోట వినిపిస్తున్న మాట. తాజాగా కూడా మరోసారి ఆయన నొక్కి వక్కాణించారు. క్షేత్రస్థాయిలో మనకు సానుకూల సంకేతాలు చాలా బాగా ఉన్నాయి కాబట్టి 175కి 175 పక్కా. ఏ ధైర్యంతో ఈ మాట ఇంత గట్టిగా చెబుతున్నారో తెలియడం లేదు. విపక్షాలను వీక్ చేయడానికా? స్వపక్షాన్ని స్ట్రాంగ్ చేయడానికా అర్థం కావడం లేదు. ఈ క్రమంలోనే జగన్ కీలక నిర్ణయాలు కూడా తీసుకుంటున్నారు. కొందరు మంత్రులను లోక్‌సభకు పోటీ చేయించడం.. కొందరు ఎమ్మెల్యేలను తీసేసి వారికేవో నామినేటెడ్ పదవులు వంటి ఆసక్తికర స్టెప్స్ తీసుకుంటున్నారని టాక్.
ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలో ఒక వెలుగు వెలిగిన ఇద్దరు నేతలు.. ప్రస్తుతం ఏపీ మంత్రివర్గంలో ఉన్నారు. వారితో పాటు మరో ఇద్దరు మంత్రులను ఈ సారి పార్లమెంటుకు పంపాలని జగన్ భావిస్తున్నారట. కొందరు ఎమ్మెల్యేలకు హ్యాండ్ ఇస్తారట. ఒక సీనియర్ మంత్రి మాత్రం అసెంబ్లీ టికెట్ తన కుమారుడికి ఇచ్చి.. తనను రాజ్యసభకు పంపాలని జగన్‌ను కోరగా ప్రస్తుతానికి వీలు పడదని చెప్పారట. ఇక మరో మంత్రిని ఈసారి ఎంపీగా పోటీ చేయాలని జగన్ సూచించారట. ఇక ఏపీ స్పీకర్ కూడా అసెంబ్లీ టికెట్ తన కుమారుడికి ఇవ్వాలని కోరారట కానీ జగన్ నుంచి ఎలాంటి సమాధానమూ రాలేదట. ఇక మరో జిల్లా విషయానికి వస్తే.. అక్కడి మంత్రిని ఎంపీగా.. ఎంపీని ఎమ్మెల్యేగా పోటీ చేయించాలని జగన్ భావిస్తున్నారని సమాచారం.
ఎస్టీ నియోజకవర్గాల్లో ఒక ఎమ్మెల్యే స్థానంలో ఎమ్మెల్సీని, మరో ఎమ్మెల్యే స్థానంలో ఎంపీని పోటీకి దించే అవకాశం ఉందంటున్నారు. వీరే కాదు.. దాదాపు మరో నలుగురు మంత్రులను లోక్‌సభ బరిలో జగన్ దింపనున్నారట. ఇప్పటికే ఆ విషయాన్ని ఆయా మంత్రులకు కూడా తెలిపారట. మార్గాని భరత్‌ను ఈసారి అసెంబ్లీ బరిలో దింపాలని యత్నిస్తున్నారట. ఈ క్రమంలోనే పలువురు ఇన్‌చార్జులకు సైతం సీఎం మొండిచేయి చూపించనున్నారట. సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో తూర్పుగోదావరి జిల్లాలో ముగ్గురు, పశ్చిమ గోదావరి, గుంటూరు జిల్లాలలో ఇద్దరు చొప్పున.. ప్రకాశం, చిత్తూరు, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున ఎమ్మెల్యేలకు టికెట్ ఇవ్వబోనని జగన్ వారికి చెప్పేశారని సమాచారం. మొత్తానికి వైసీపీలో భారీ మార్పులు చేర్పులకు జగన్ శ్రీకారం అయితే చుట్టారు. మరి ఫలితం ఎలా ఉంటుందో చూడాలి.