ఏదో ఒక ప్రోగ్రాం పెట్టడం.. ప్రతిపక్షాలను ఎండగట్టడం.. ఇదొక తంతు అయిపోయింది ఏపీ సీఎం జగన్‌కి. తానేదో ఘన కార్యం సాధించినట్టు ప్రతిపక్ష పార్టీ అవినీతికి కేరాఫ్ అడ్రస్ అయినట్టుగా నీతులు వల్లిస్తున్నారు. జగన్ జైలు బాగోతం ఎవరికి తెలియదు. అయినా సరే.. ఇప్పుడు గట్టు మీద ఉన్నారు కాబట్టి నీళ్లలో ఉన్న వాళ్లపైన రాళ్లు వేయాల్సిందే. దానికి ప్రోగ్రాం ఏంటన్న దాంతో సంబంధం లేదు. ప్రోగ్రాం గురించి చెప్పేదేముంది? జనం దొరికారు కాబట్టి విపక్షాలను ఎండగడితే మనకు అంతో ఇంతో మైలేజ్ వస్తుందన్న ఆత్రం. తాజాగా సీఎం జగన్ ఐదో విడత వైఎస్సార్ వాహనమిత్ర నిధులను విడుదల చేశారు. 2,75,931 మందికి పది వేల చొప్పున 275.93 కోట్లను బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాలో వేశారు.
ఆలోచన చేయమని అడుగుతున్నా..!
రేపు కురుక్షేత్రం యుద్ధం జరగబోతోందట. నిరుపేదల కోసం నిలబడిన మన ప్రభుత్వం ఒక వైపుంటే.. నిరుపేదలను వంచించిన వారు మరొక పక్క ఉన్నారట. మరి కౌరవ సేన పెద్దదా? పాండవ సేనా? 151 మంది ఎమ్మెల్యేలున్న జగన్ సేన 23 మంది ఎమ్మెల్యేలున్న టీడీపీతో కురుక్షేత్రం యుద్ధం చేయబోతోందని జగన్ ఉవాచ. మరి కౌరవులెవరనేది చెప్పాల్సిన పని లేదు కదా. ఇక సామాజిక అన్యాయాలు చేసే ప్రత్యర్ధులతో యుద్ధం జరగబోతోందట. రూ.43 వేల కోట్లు నొక్కేసింది సామాజిక న్యాయం కోసమా.. ఏంటి కొంపదీసి? అది చాలదన్నట్టు మ్యానిఫెస్టోలో 99 శాతం అమలు చేశాం.. మ్యానిఫెస్టోను చెత్తబుట్టలో వేసేసి అందులో పదిశాతం కూడా అమలు చేయని వారితో యుద్ధం జరగబోతోందని చెబుతోంది. ఉద్యోగాలెక్కడ సారూ? ఇంకా ఆ మ్యానిఫెస్టోని ఏం ఏకరువు పెడతాంలే.
ఎస్సీ కులాల్లో ఎవరైనా పుడతారా? అనే అహంకారానికి.. బీసీల పట్ల అనుచితంగా మాట్లాడుతూ కండకావరం ప్రదర్శించిన వారితో యుద్ధం జరగబోతోందట. అసలు బీసీలకు పెద్ద పీట వేసిందే టీడీపీ కదా. అలాగే ఒక దళితుడిని హత్య చేసిన అహంకారి వైసీపీ ఎమ్మెల్సీ కాదా? తాము అప్పులు తక్కువగా చేశామని.. గతంలో ఇలా ఎందుకు చేయలేకపోయారని వామ్మో.. ఎందుకులే జగన్ అసలు తన గురించి తాను విమర్శించుకుంటున్నారో లేదంటే విపక్షం గురించి విమర్శిస్తున్నారో అర్థం కాకుండా ఉంది. ఫినిషింగ్ టచ్ ఏంటో తెలుసా? టీడీపీ వాళ్ల మాదిరిగా తనకు పేపర్లతో పాటు దత్తపుత్రుడు సపోర్ట్ లేదట. సాక్షి ఎవరిది? ఇక మీడియా సంస్థల్లో 70 శాతం వైసీపీవే కదా. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీయే ఫుల్ సపోర్ట్ అని టాక్. ఇక దత్తపుత్రుడితో పనేంటి? అని జనం ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి జగన్ వాహన మిత్ర ఏమో కానీ తన గొయ్యి మాత్రం తనే తవ్వుకున్నారు.