తెలంగాణలో రాజ్‌భవన్, ప్రగతిభవన్‌ల మధ్య దూరం తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరుగుతోందా? అంటే ఔననే సమాధానమే వినిపిస్తోంది. ఆ మధ్య సీఎం కేసీఆర్ ఆమెను నూతన సచివాలయానికి ఆహ్వానించడం.. ఆపై గవర్నర్ టీఎస్‌ఆర్టీసీ బిల్లుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం వంటి అంశాలు చకచకా జరిగిపోయాయి. దీంతో సీఎం కేసీఆర్, గవర్నర్ తమిళిసై మధ్య సయోధ్య కుదిరిందంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే గతంలో ఏ వ్యవహారంలో అయితే రాజ్‌భవన్, ప్రగతి భవన్‌ల మధ్య దూరం పెరిగిందో.. ఇప్పుడు అదే అంశం తిరిగి ఈ రెండింటి మధ్య నిప్పును రాజేసింది.
తాజాగా గవర్నర్ నామినేటెడ్ ఎమ్మెల్సీ కోటాలో ప్రభుత్వం సిఫార్సు చేసిన కుర్రా సత్యనారాయణ, దాసోజు శ్రవణ్ పేర్లను తమిళి సై తిరస్కరించారు. ఇది కాస్తా మరోసారి రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. గతంలో ఎమ్మెల్సీ కోటా కింద పాడి కౌశిక్ రెడ్డిని ప్రభుత్వం సిఫార్సు చేసింది. అయితే ఆయన సేవా కార్యక్రమాలు నిర్వహించలేదన్న కారణంతో గవర్నర్ తిరస్కరించారు. ఇది అప్పట్లో హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పుడు కుర్రా సత్యనారాయణ, దాసోజు శ్రవణ్‌లను ప్రభుత్వం సిఫార్సు చేయగా.. గవర్నర్ తిరస్కరించారు. అప్పట్లో కేసీఆర్ వర్సెస్ తమిళిసై పెద్ద వారే నడిచింది. కనీసం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు సైతం గవర్నర్‌కు కేసీఆర్ పిలవలేదు. ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రోటోకాల్ పాటించింది కూడా లేదు.
సచివాలయంలో దేవాలయం, మసీదు, చర్చి ప్రారంభోత్సవానికి గవర్నర్‌ను కేసీఆర్ సచివాలయానికి ఆహ్వానించారు. ఆమెకు సాదర స్వాగతం పలికి సచివాలయం అంతా కేసీఆర్ తిప్పి చూపించారు. ఇంకేముంది? వారిద్దరి మధ్య అంతరం తగ్గిపోయిందంటూ ప్రచారం జరిగింది. ఇప్పుడు కథ మళ్లీ మొదటికి వచ్చింది. మరోవైపు ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఏ క్షణమైనా సీఎం కేసీఆర్ తనయురాలు, ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేస్తారంటూ టాక్ నడుస్తోంది. ఈ రెండు పరిణామాలు బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటి కాదన్న సంకేతాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకేనా? అన్న అనుమానాలు సైతం వ్యక్తం అవుతున్నాయి. మొత్తానికి గవర్నర్ వర్సెస్ సీఎం కథ మళ్లీ మొదటికి వచ్చినట్టేనని టాక్ నడుస్తోంది.