తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఫుల్ జోష్‌లో ఉంది. అసలు టీ కాంగ్రెస్ గురించి చెప్పాలంటే.. కర్ణాటక ఎన్నికలకు ముందు.. తర్వాత. కర్ణాటక ఎన్నికలకు ముందు అయితే మూడో స్థానంలో ఉండేది. ఇక ఇప్పుడు అధికార బీఆర్ఎస్‌కు సవాల్ విసిరే రేంజ్‌కి ఎదిగింది. రెండు పర్యాయాలు అధికారంలో ఉంటే ఏ పార్టీపైనైనా జనంలో వ్యతిరేకత పెరుగుతుంది. అది సర్వసాధారణం. ఇక బీఆర్ఎస్ పైన అయితే అటు సామాన్య ప్రజానీకం.. ఇటు ఉద్యోగులు, అటు విద్యార్థుల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చేసింది. దీనికి తోడు కర్ణాటక కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించడంతో ఆ ఎఫెక్ట్ తెలంగాణపై కూడా పడింది. ఇక అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ బీభత్సమైన ఊపు మీదుంది. బీజేపీని మూడో స్థానానికి తోసేసి బీఆర్ఎస్‌కు ప్రత్యర్థిగా మారిపోయింది.
ఇక ఇప్పుడు చేరికలు సైతం కాంగ్రెస్ పార్టీకి కావల్సినంత బలాన్నిస్తున్నాయి. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ చాలా తెలివిగా వ్యవహరిస్తోంది. హడావుడిగా అభ్యర్థుల జాబితాను ప్రకటించకుండా ఆచి తూచి వ్యవహరిస్తోంది. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల జాబితాను ప్రకటించిన వెంటనే హడావుడి చేయలేదు. ఇక ఇప్పటి వరకైతే.. 70 స్థానాల్లో తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక కసరత్తు ఓ కొలిక్కి వచ్చినట్టు సమాచారం. మిగతా స్థానాలపై స్క్రీనింగ్ కమిటీ సమావేశం కొనసాగనుంది. 70 స్థానాల వివరాలను స్క్రీనింగ్ కమిటీ ఛైర్మన్ అధిష్టానానికి అందజేయడం జరిగింది. వాటిని కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటి పరిశీలించనుంది. అనంతరం తొలి జాబితా విడుదల కానుంది.
ఇక టీ కాంగ్రెస్‌లో ఇంకా చేరికలు కొనసాగుతూనే ఉన్నాయి. బీఆర్ఎస్‌కు చెందిన కీలకక నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. ఇప్పటికే పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు వంటి వారు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇక మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం పార్టీలో చేరనున్నారు. ఇప్పటికే ఆయన ఢిల్లీకి చేరుకున్నారు. ఇక మైనంపల్లి హనుమంతరావు సైతం బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. ఆయన కూడా తన కుమారుడితో కలిసి కాంగ్రెస్‌లో చేరే అవకాశం ఉంది. మొత్తానికి కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో మరింత స్ట్రాంగ్ అవుతోంది. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ ఆందోళన చెందుతోంది. ఈ క్రమంలోనే కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చిన మాదిరిగానే ఇక్కడ కూడా ఇస్తామని ప్రకటించింది. ఒకరకంగా కాంగ్రెస్ సక్సెస్ మంత్రాన్నే బీఆర్ఎస్ కూడా పలుకుతోంది. ఒకరకంగా గులాబీ బాస్‌కు కాంగ్రెస్ పార్టీ వెన్నులో వణుకు పుట్టిస్తోందనడంలో సందేహం లేదు.