స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌లో అరెస్టై రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న టీడీపీ అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడికి నేడు కోర్టులో చుక్కెదురైంది. అయితే ఈ కేసు నుంచి ఇవాళైన ఊరట కలుగుతుందని భావించిన ఆయనకు నిరాశే ఎదురైంది. కోర్టుల్లో ఇవాళ చంద్రబాబుకు బ్యాక్ టూ బ్యాక్ ఇబ్బందికర పరిణామాలు ఎదురయ్యాయి.
ఏసీబీ కోర్టు ఆయన రిమాండ్‌ను పొడిగించింది. అలాగే హైకోర్టులో దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను కొట్టివేయడం జరిగింది. ఆ వెంటనే ఏసీబీ కోర్టు ఆయన్ని సీఐడీ విచారణకు అనుమతిస్తూ తీర్పును వెలువరించింది. ఇది చాలదన్నట్టు చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై వాదనలను సైతం ఏసీబీ కోర్టు వాయిదా వేసింది. ఇక సీఐడీ అధికారులు చంద్రబాబును జైల్లోనే విచారించనున్నారు. ఉదయం 9.30 నుంచి సాయంత్రం 5గంటల మధ్య విచారణ పూర్తి చేయాలి. అలాగే ఇద్దరు లాయర్లను అనుమతిస్తామని సీఐడీ అధికారులు వెల్లడించారు. చంద్రబాబు విచారణ జరిగే సమయంలో ఫొటోలు, వీడియోలు బయటకు రాకుండా చూడాలని సీఐడీ అధికారులకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
కాగా.. హైకోర్టు ఉత్తర్వులను టీడీపీ నేతలు సుప్రీంకోర్టులో సవాల్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సుప్రీంకోర్టు లాయర్లతో మాట్లాడినట్టు సమాచారం. ఏసీబీ కోర్టు తీర్పుల నేపథ్యంలో జడ్జిమెంట్ కాపీలను పరిశీలించిన అనంతరం రేపు లేదంటే సోమవారం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉంది. క్వాష్ పిటిషన్ డిస్మిస్ చేయడాన్ని సైతం టీడీపీ సుప్రీంకోర్టులో సవాల్ చేయనున్నట్టు తెలుస్తోంది.