ఏదో జైలుకెళ్లి టీడీపీ అధినేత చంద్రబాబును పరామర్శించి వస్తారనుకుంటే జనసేన అధినేత బాంబు పేల్చారు. టీడీపీ పొత్తు ఉంటుందని అధికారిక ప్రకటన చేశారు. ఇది వైసీపీకే కాదు.. జనసేన పార్టీకి కూడా షాకే. ఇక బీజేపీకి అయితే ఇది ఊహించని పరిణామమే. ఏదో తమతో చర్చిస్తారు. ఆ తరువాత పొత్తుపై ఓ నిర్ణయానికి వెళతారని బీజేపీ నేతలు భావించారు. కానీ నేరుగా పవన్ అధికారిక ప్రకటనే చేశారు. మరోవైపు కాపు సామాజిక వర్గం ఈ పొత్తుపై రగిలిపోతోంది.
జనసేన ద్వారా కాపులకు అధికారం వస్తుందని భావించిన వారికి ఇది నిజంగా షాకింగ్ న్యూసే. పవన్ తీసుకున్న నిర్ణయంతో తమకేంటని కాపు సామాజిక వర్గం ప్రశ్నిస్తోంది. పెద్ద ఎత్తున ఈ పొత్తు గురించి కాపు సామాజిక వర్గాల్లో చర్చ జరుగుతోంది. పవన్ ఈ పొత్తుతో కేవలం టీడీపీని ముందుకు నడిపించి తను మాత్రం ఉన్న చోటనే ఆగిపోతాడా? అనే సంశయం వారిలో నెలకొంది. ఒకవేళ గెలిస్తే.. పవన్‌కు కనీసం రెండున్నరేళ్లయినా ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెడతారా? అనే సంశయం నెలకొంది.
ఈ నేపథ్యంలో చంద్రబాబు కోసం తామెందుకు బలి కావాలనే ప్రశ్నలు కాపుల్లో తలెత్తుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో అధికారం గడచిన 60 ఏళ్లుగా రెండు సామాజిక వర్గాల మధ్యే షేర్ అవుతోంది. పవన్ కారణంగా తమ సామాజిక వర్గానికి కూడా అధికారం చేజిక్కుతుందని భావించిన వారికి నిరాశే మిగులుతోంది. ఒకవేళ పవన్‌కు రెండున్నరేళ్ల పాటు ముఖ్యమంత్రి పదవి ఇస్తామంటే మాత్రం కాపులు మొత్తం ఈ కూటమి వైపే ఉంటారు. లేదంటే మాత్రం కాపుల ఓటు బ్యాంకును దాదాపు పవన్ దూరం చేసుకున్నట్టే అని ఆ సామాజిక వర్గ నేతలు, రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.