ఎన్నికల ముందే జనసేన పార్టీకి తొలి విజయం లభించింది. ఈ విజయంతో జనసేన ఫుల్ ఖుషీలో మునిగి తేలుతోంది. ఇక ఈసారి అంతా సక్సెస్ అనే భావన ఆ పార్టీ నుంచి వ్యక్తమవుతోంది. ఇంతకీ ఏంటా సక్సెస్ అంటారా..? గ్లాస్ గుర్తును తిరిగి జనసేనకే కేంద్ర ఎన్నికల సంఘం కేటాయించింది. జనసేన గాజు గ్లాస్ గుర్తును కొంత కాలం క్రితం కేంద్ర ఎన్నికల సంఘం రద్దు చేసినప్పటి నుంచి ఆ పార్టీపై జరిగిన ప్రచారం అంతా ఇంతా కాదు. ఇకపై జనసేన పార్టీకి ఎలాంటి గుర్తూ ఉండబోదంటూ అధికార వైసీపీ పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించింది. కనీసం కొత మేర అయినా ఓటు బ్యాంకును సాధించలేక ఒక పర్మినెంట్ గుర్తును జనసేన కోల్పోయిందంటూ విమర్శలు గుప్పించారు.
ఇక వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీకి ఒక గుర్తు అంటూ ఉండదని ఎద్దేవా చేశారు. పవన్ సినిమాలపై కూడా విమర్శలు గుప్పిస్తూ గాజు గ్లాస్‌తో పవన్ తన సినిమాల్లో ఫోజులు ఇస్తుంటారని.. అసలు అది వారి గుర్తే కాదని వారికి ఎప్పుడు అర్థమవుతుందో అంటూ వెటకారం చేసింది. అంతేనా.. ఇక మీదట పవన్‌తో పాటు ఆయన పార్టీ నేతలంతా.. సైకిల్ గుర్తుపై పోటీ చేస్తారంటూ ప్రచారం చేశారు. సైకిల్ గుర్తుపై జనసేన నేతలు పోటీ చేస్తారని వారే ప్రచారం చేసి పైగా ఆ గుర్తుపై పోటీ చేసిన వాళ్లు జనసేన నేతలు ఎలా అవుతారంటూ ప్రశ్నించారు. ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం గాజు గ్లాస్ గుర్తునే వారికి కేటాయించింది కాబట్టి ఇప్పుడు వైసీపీ నేతలు ఏం మాట్లాడుతారో చూడాలి.
అసలు మాట్లాడటానికి ఇంకా ఏముందిలే.. అంతా గప్ చుప్. పార్టీలన్నాక పొత్తు పెట్టుకోవా? దానిపై కూడా విమర్శలే. అసలు అభ్యర్థులను పోటీ పెట్టడం కానీ.. అసెంబ్లీలో ఒక పార్టీకి ప్రాతినిధ్యం వహించాలనే లక్ష్యం కానీ జనసేనకు లేవని విమర్శలు. అంటే ఒక పార్టీతో పొత్తు పెట్టుకుంటే లక్ష్యాలేవీ లేనట్టుగా.. ఆ పార్టీని స్వయంగా అధినేతే గంగలో కలుపుకున్నట్టా? పొత్తు పెట్టుకుంటే చంద్రబాబుకు జీహుజూర్ అన్నట్టేనా? ఒక్క గ్లాస్ గుర్తు పోతే.. ఇన్ని అభాండాలా? కానీ జనసేనాని మాత్రం అద్భుతం అనే చెప్పాలి. ఎన్ని విమర్శలొచ్చినా తట్టుకుని నిలబడ్డారు తప్ప వెనుకడుగు వేయలేదు. మాటకు మాట జవాబిచ్చారు తప్ప మౌనం వహించలేదు. ఓడిపోయామని గమ్మున కూర్చోలేదు. మొత్తానికి తొలి విజయంతో మలి విజయానికి బాటలు వేసుకుంది.