అనుకున్నది అనుకున్నట్టు జరిగితే జీవితం ఎందుకవుతుంది? అంటారు. కానీ రాజకీయాల్లో మాత్రం స్కెచ్ వేస్తే అనుకున్నది అనుకున్నట్టు జరిగాలి. లేదంటే బాగా దెబ్బతింటాం. ఇక అసలు విషయంలోకి వెళితే.. ఏపీలో వైసీపీ ప్రభుత్వం అనుకున్నదొకటి.. జరుగుతోంది మరొకటి. టీడీపీ అధినేత చంద్రబాబును స్కిల్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ కేసులో అవినీతి జరిగిందని చెప్పి జైలులో పెట్టించింది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ను సైతం అరెస్ట్ చేస్తామంటూ లీకులు ఇస్తోంది. లోకేష్‌ని సైతం అరెస్ట్ చేసి జైలుకు పంపించి టీడీపీని దిక్కు దివాణం లేకుండా చేయాలని స్కెచ్ గీసింది.
అసలు నేతలే జైలుకి వెళితే..
ఈ క్రమంలోనే తాము అనుకున్న దాన్ని మరింత స్ట్రాంగ్‌గా జనాల్లోకి తీసుకెళ్లడానికి లాయర్లను వినియోగిస్తోంది. కోర్టులో కౌంటర్లు దాఖలు చేయడానికి వారాల తరబడి గడువు అడుగుతున్న లాయర్లు.. గంటల తరబడి ప్రెస్‌మీట్లతో వివరాలు చెబుతున్నారు. మొత్తాన్ని ఏపీలో రాజకీయం హాట్ హాట్‌గా మారిపోయింది. అసలు నేతలే జైలుకి వెళితే ఇక మిగిలిన నేతలు, టీడీపీ కార్యకర్తలు రోడ్ల మీదకు రావడానికే భయపడతారు తద్వారా టీడీపీని భూస్థాపితం చేయవచ్చనేది స్కెచ్ అని ఆరోపణలు ఉన్నాయి. కానీ చంద్రబాబుకు మద్దతుగా జనం బీభత్సంగా రోడ్డెక్కుతున్నారు. నిరసనలు రోజురోజుకూ పెరుగుతుండటం అధికార పార్టీని సైతం అవాక్కయ్యేలా చేస్తోంది.
వైసీపీ ప్రభుత్వానికి భయం పట్టుకుందట..
ఐయామ్ విత్ బాబు అంటూ జనం రోడ్డెక్కుతున్నారు. తెలంగాణ, కర్ణాటకల్లోనే కాకుండా అమెరికా వంటి దేశాల్లో సైతం చంద్రబాబుకు మద్దతుగా ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ఇక ఏపీలో అయితే పలు చోట్ల మహిళలే ముందుడి మరీ నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తూ ఉండటం ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇదంతా చూసి వైసీపీ ప్రభుత్వానికి భయం పట్టుకుందట. ఇలాంటి నిరసన ప్రదర్శనలు మరింత ఊపందుకుని రాష్ట్రమంతా పాకితే ఇబ్బందికరమని భావిస్తోందట. మరోవైపు టీడీపీ సైతం చంద్రబాబు చేసిన అభివృద్ధి పనులు విస్తృతంగా ప్రచారం చేస్తుండటంతో సానుభూతి మరింత పెరుగుతోంది.
మొత్తానికి చంద్రబాబును అరెస్ట్ చేసి భస్మాసురుడి మాదిరిగా మన నెత్తిపై మనమే చేయి పెట్టుకున్నామనే భావనలో వైసీపీ అధినేతలు ఉన్నారట.