తెలంగాణ రాజకీయాల్లో సెప్టెంబర్-17 సెగ మామూలుగా లేదు. గతంలో ఈ సెప్టెంబర్ 17ను అధికార పార్టీ సహా మిగిలిన ప్రధాన పార్టీలేవి సరిగా పట్టించుకోలేదు కానీ ప్రస్తుతం ఎన్నికల తరుణం కావడంతో అధికార, ప్రతిపక్షాలు పోటాపోటీగా బహిరంగ సభలు నిర్వహిస్తున్నాయి. దీనికోసం అధిష్టానాన్ని సైతం రంగంలోకి దింపాయి. హైదరాబాద్ పరేడ్‌గ్రౌండ్‌లో బీజేపీ సభ.. చీఫ్ గెస్ట్‌గా కేంద్ర హోంమంత్రి అమిత్‌షా హాజరయ్యారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా సభ నిర్వహిస్తోంది. దీనికి పార్టీ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ తదితరులంతా హాజరయ్యారు. రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ వేదికగా జరిగిన విజయభేరి సభలో ఎన్నికల హామీలు ప్రకటించారు.
ఎన్నికల ప్రకటనలు
మహాలక్ష్మీ: మహిళలకు ప్రతినెల రూ.2500
రూ.500కే గ్యాస్ సిలెండర్
ఆర్టీసీ బస్సులో మహిళలకు రాష్ట్రమంతటా ఉచిత ప్రయాణం
రైతు భరోసా: ప్రతిఏటా రైతులకు ఎకరానికి రూ.15వేలు పెట్టుబడి సాయం
కౌలు రైతులకు, వ్యవసాయ కూలీలకు రూ.12వేలు
వరి పంటకు రూ.500 బోనస్
గృహజ్యోతి: ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్
ఇందిరమ్మ ఇళ్లు: ఇంటి నిర్మాణానికి స్థలం ఉంటే రూ.5 లక్షలు
ఉద్యమకారులకు 250 చదరపు గజాల ఇళ్ల స్థలం
యువవికాసం: విద్యార్థులకు రూ.5 లక్షలు
ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్‌నేషనల్ స్కూల్
చేయుత: వృద్ధులకు, వికలంగులకు, వంటరి మహిళలు రూ.4వేల నెలవారి పెన్షన్
రూ.10 లక్షల రాజీవ ఆరోగ్య భీమ. కాగా కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలనే ఇక్కడ కూడా ఇచ్చింది. అక్కడ సరే.. ఇక్కడ ఎంతవరకూ వర్కవుట్ అవుతుందో చూడాలి.
ఎక్కడ చూసినా పోస్టర్లు..
ఇక అధికార బీఆర్ఎస్ పార్టీ కూడా జాతీయ సమైక్యతా దినోత్సవం పేరిట కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అయితే మంచి జోష్ మీదుంది. ఎందుకంటే బీఆర్ఎస్‌కు చెందిన కీలక నేతలు కొందరు నేడు కాంగ్రెస్ పార్టీ తీర్థం తీసుకోనున్నారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున సీఎం కేసీఆర్‌కు వ్యతిరేకంగా పోస్టర్లు అంటించింది. బుక్ మై సీఎం, డీల్స్ అవైలబుల్ అని, 30 శాతం కమీషన్ అని నగరంలో పలు చోట్ల పోస్టర్లు వెలిశాయి. కర్ణాటకలో పే సీఎం అని ప్రచారం చేసి సక్సెస్ అయి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది.
బుక్ మై సీఎం!
ఇప్పుడు తెలంగాణలో బుక్ మై సీఎం అంటూ ప్రచారం ప్రారంభించింది. ఇదే సెంటిమెంట్ వర్కవుట్ అయితే మాత్రం తెలంగాణలో సైతం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమనే చర్చ నడుస్తోంది. ఇక బీఆర్ఎస్ పార్టీ సైతం పోస్టర్ల వార్ చేస్తోంది. కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందంటూ అక్కడక్కడ పోస్టర్లు దర్శనమిస్తున్నాయి. అందులో.. 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందని, ఎస్సీ విభజనపై దళితులను మోసం చేస్తూ వచ్చిందని పోస్టర్ల ద్వారా ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలోనే కొత్తగా ఎస్సీ డిక్లరేషన్‌తో ముందుకు వచ్చిందని, మళ్లీ ఇదే మోసం కావాలా అంటూ అందులో పెద్ద పెద్ద అక్షరాలతో ప్రింట్ చేయించారు. మొత్తానికి సభలు, పోస్టర్లతో పొలిటికల్ హీట్ ఓ రేంజ్‌లో ఊపందుకుంది. మొత్తానికి చూస్తే.. అటు కర్ణాటకలో లాగే.. వ్యూహకర్త సునీల్ కొనుగోలు తెలంగాణలో కూడా అచ్చు గుద్దినట్లుగా దింపేస్తున్నారు. పోస్టర్లు, ఎన్నికల హామీలు కూడా అదే పంథాను ఎంచుకుంది కాంగ్రెస్. మరి అవన్నీ ఏ మాత్రం ఫలితాలిస్తాయో చూడాలి.