టీడీపీ, జనసేనల మధ్య పొత్తు పొడిచిన విషయం అందరికీ తెలిసిందే. ఇది ఎప్పటి నుంచో అనుకుంటున్న విషయమే కానీ తాజాగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ అనూహ్యంగా అధికారిక ప్రకటన చేశారు. ఏదో చంద్రబాబుతో మాట్లాడి వెళ్లిపోతారనుకుంటే ఆయన సంచలనానికి తెరదీశారు. ఇకపై వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలిసే వెళతాయని స్పష్టం చేశారు. బీజేపీ కూడా తమతో కలిసి వస్తుందని ఆశా భావం వ్యక్తం చేశారు. అంతా ఓకే కానీ మరి సీట్ల మాటేంటి? అని పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది.
సీట్ల విషయంలో కూడా త్వరలోనే ఇరు పార్టీలు చెక్ పెడతాయని టాక్ నడుస్తోంది. ఇప్పటికే టీడీపీ, జనసేనల మధ్య సీట్ల కేటాయింపు ప్రక్రియ పూర్తైందని ప్రచారం జరుగుతోంది. సీట్ల కేటాయింపు ప్రక్రియలో భాగంగా.. జనసేనకు 25 అసెంబ్లీ, 3 పార్లమెంట్ సీట్లు కేటాయించడం జరిగిందట. ముఖ్యంగా జనసేన అధినేత గాజువాక అసెంబ్లీ నుంచి పోటీ చేసే అవకాశం ఉందట. గుంటూరు వెస్ట్ నుంచి నాదెండ్ల మనోహర్ పోటీ చేస్తారని తెలుస్తోంది. ఇక వైసీపీకి రాజీనామా చేసి ఈసారి రఘురామ కృష్ణరాజు జనసేన నుంచి పోటీ చేస్తారట.
నరసాపురం పార్లమెంటు నుంచి జనసేన తరుఫున ఎన్నికల బరిలోకి రఘురామ దిగుతారని సమాచారం. మొత్తంగా జనసేనకు లోక్‌సభ సీట్లు వచ్చేసి కాకినాడ, నరసాపురం,అనకాపల్లి కేటాయించారట. బీజేపీతో పొత్తు ఉంటే మాత్రం ఒక పార్లమెంట్, రెండు అసెంబ్లీ సీట్లు ఆ పార్టీకి కేటాయించే అవకాశం ఉందని తెలుస్తోంది. పొత్తు ఉంటే మాత్రం బీజేపీ నుంచి.. నరసరావుపేట పార్లమెంట్ నుంచి బరిలో దగ్గుబాటి పురందేశ్వరి ఉండే అవకాశం ఉంది. కైకలూరు నుంచి కామినేని శ్రీనివాస్ .. విశాఖ నార్త్ నుంచి విష్ణుకుమార్ రాజు బరిలోకి దిగే అవకాశం ఉందని సమాచారం. ఇక మిగిలిన అన్ని స్థానాల్లో టీడీపీ పోటీ చేయనుందని తెలుస్తోంది.