అన్న జైలులో ఉన్నప్పుడు వైఎస్ షర్మిల ఒక ఉద్యమ కెరటం మాదిరిగా రాజకీయరంగ ప్రవేశం చేశారు. జగనన్న వదిలిన బాణాన్ని అంటూ వైసీపీకి అన్నీ తానై నిలిచారు. పాదయాత్ర చేసి అన్న స్థాపించిన పార్టీని నిలబెట్టారు. అన్నను సీఎం పీఠంపై కూర్చోబెట్టారు. ఆ తరువాత అన్నతో విభేదాలు.. జైలులో ఉన్నంత కాలం చెల్లిని రాజకీయంగా బీభత్సంగా వినియోగించుకుని ఆ తర్వాత ఆమెతో సంబంధాలే తెగదెంపులు చేసుకున్నారు జగన్. అన్న చేసిన మోసాన్ని తట్టుకుని అక్కడ నిలబడలేక ఏపీని వదిలి తెలంగాణలో వైఎస్సార్‌టీపీ పేరిట రాజకీయ పార్టీని ప్రారంభించారు షర్మిల. అప్పటి నుంచి జనాల్లోకి దూసుకెళుతున్నారు. తనదైన ముద్ర వేసేందుకు శతవిధాలా యత్నించారు.
సడెన్‌గా షర్మిలకు ఏమైందో ఏమో కానీ అస్త్ర సన్యాసం చేశారు. తాను కాంగ్రెస్ పార్టీలో చేరుతానంటూ కొత్త పల్లవి అందుకున్నారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలతో భేటీల మీద భేటీలు అయ్యారు. ట్రబుల్ షూటర్, కర్నాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ద్వారా మంత్రాంగం నడిపారు. కానీ ఎందుకో పార్టీ విలీన ప్రక్రియ మాత్రం ముందుకు సాగడం లేదు. తెలంగాణలో సీడబ్ల్యూసీ సమావేశాలు జరగనున్నాయి. కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు మల్లిఖార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ తదితర కాంగ్రెస్ దిగ్గజాలు అందరూ హైదరాబాదుకు వచ్చేశారు. ఈ తరుణంలో పార్టీలో చేరబోయే వారి పేర్లు బలంగా వినిపిస్తోంది కానీ.. షర్మిల కాంగ్రెస్‌లో విలీనం తాలూకు న్యూస్ ఒక్కటంటే ఒక్కటి కూడా వినిపించడం లేదు.
నిజానికి షర్మిల ఆశిస్తున్నట్టుగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఆమెకు పెద్ద పీట వేసేందుకు కాంగ్రెస్ పార్టీ సుముఖంగా లేదని టాక్. జగనన్న వదిలిన బాణంగా చెప్పుకున్న షఱ్మిలను ఆ అన్న మీదకే సంధించాలని పార్టీ భావిస్తోంది. ఈ విషయంపై షర్మిల ఏ నిర్ణయమూ తీసుకోలేకపోతున్నారట. ఇక తెలంగాణ విషయానికి వస్తే.. ఇక్కడి నేతలు షర్మిలకు అగ్ర స్థానాన్ని అప్పగిస్తామంటే ఒప్పుకునేలా లేరట. గత ఎన్నికల్లో టీడీపీతో పొత్తు పెట్టుకున్నందుకే కేసీఆర్ ప్రాంతీయాభిమానాన్ని రెచ్చగొట్టి కాంగ్రెస్ పార్టీని ఘోరంగా ఓడించారు. ఇప్పుడు షర్మిలకు పార్టీలో పెద్ద పీట వేసినా కూడా అదే జరుగుతుందని టీ కాంగ్రెస్ నాయకులు అభిప్రాయపడుతున్నారు. చివరకు ఆమె కోరుకున్న పాలేరు స్థానాన్ని కూడా ఆమెకు ఇచ్చేందుకు అంగీకరించేలా లేరు. ఇలాంటి తరుణంలో ఒక పార్టీని స్థాపించి దాదాపు మూడేళ్ల పాటు తను పడిన కష్టాన్ని వృథా చేసుకుని షర్మిల ఏం సాధిస్తారనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ సీడబ్ల్యూసీ సమావేశాల్లో పార్టీ విలీనం ఉంటేనా.. ఓకే.. లేదంటే ఈ ప్రతిపాదన వెనక్కిపోయినట్టేనని పలువురు అభిప్రాయపడుతున్నారు.