టీడీపీ, జనసేన పొత్తు ప్రకటనను పవన్ కల్యాణ్ నిన్న అధికారికంగా ప్రకటించారు. టీడీపీ అధినేత చంద్రబాబుతో ములాఖత్ అనంతరం జనసేన అధినేత పవన్ ఈ ప్రకటన చేసిన విషయం తెలసిందే. ఈ ప్రకటన వచ్చిన వెంటనే వైసీపీ నేతలంతా మీడియా ముందు క్యూ కడతారని అంతా భావించారు. కానీ ఏ ఒక్కరూ కూడా మీడియా ముందుకు వచ్చింది లేదు. ఏదో మాట్లాడాలా? వద్దా? అన్నట్టుగా ఏదో మాట్లాడుతున్నారు కానీ పూర్తి స్థాయిలో పొత్తుపై స్పందించిన పాపాన పోలేదు. ప్రస్తుతం ఏపీలో ఇది హాట్ టాపిక్‌గా మారింది. ఏ చిన్న ప్రకటన విపక్షాల నుంచి వచ్చినా గుంపుగా వచ్చి మీడియా ముందు ఇష్టానుసారంగా మాట్లాడే నేతలా? ఇంత గమ్మున కూర్చొంది అని జనం ముక్కున వేలేసుకుంటున్నారు.
ఇవాళ ఏపీ సీఎం జగన్.. ఆంధ్రప్రదేశ్‌లో ఒకేసారి ఐదు మెడికల్ కాలేజీలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించారు. శుక్రవారం విజయనగరం గాజులరేగలో 70 ఎకరాల సువిశాల స్థలంలో ఏర్పాటు చేసిన మెడికల్ కాలేజీ ప్రారంభించి.. అక్కడ నుంచి వర్చువల్‌గా మిగతా నాలుగు మెడికల్ కాలేజీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం జగన్.. టీడీపీ, వైసీపీ పొత్తుపై మాట్లాడటం ఖాయమని అంతా భావించారు. కానీ ఆయన కేవలం మెడికల్ కాలేజీల గురించి మాట్లాడి ముగించేశారు. అసలు లండన్ నుంచి వచ్చాక జగన్ మీడియాతో టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ విషయంపైనే మాట్లాడకపోవడం ఆసక్తిని రేకెత్తించింది. ఇలా అసలు స్పందించకుంటే అసలుకే ఎసరొస్తుందని భావించారో ఏమో కానీ నేడు జగన్ స్పందించారు. జగన్ ప్రసంగంలో కొత్తగా ఏమీ లేవు. అవే ఆరోపణలు. పదే పదే చంద్రబాబును పలుకుబడి కలిగిన ముఠా కాపాడుతోందట.
ఇంతకీ ఆ ముఠా ఏదో జర చెప్పి పుణ్యం కట్టుకోవచ్చుగా. అది లేదు. అసలు చంద్రబాబు కంటే పలుకుబడి కలిగిన వారంటే కేంద్ర పెద్దలా? అతడే ఉంటే మంగలితో పనేంటని.. ఓ సామెత ఉంది. కేంద్రం అండే ఉంటే చంద్రబాబు కూడా జగన్ మాదిరిగా దేశ దేశాలు తిరిగొచ్చేవారు కానీ అక్రమ కేసుల్లో ఇరుక్కుని జైలు పాలు అయ్యేవారు కాదుగా.. పోనీ కేంద్రం కాకుండా ఇంకా పలుకుబడి కలిగిన ముఠా ఏముంది? చంద్రబాబు అరెస్ట్‌తో ఆ పార్టీకి బీభత్సమైన డ్యామేజ్ జరుగుతుందని.. ఈసారి కూడా అధికారం దక్కించుకునేది తామేనని భావించి స్కెచ్ గీసి చంద్రబాబును అక్రమ కేసులో ఇరికించారు. కానీ ఆ తరువాత పరిస్థితులు మరోలా ఉన్నాయి. చంద్రబాబుకు ఎక్కడలేని సింపతి వచ్చేసింది. తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి అధికారంలో ఉన్నప్పుడే జగన్ వేల కోట్లు కాజేశారు. అలాంటిది 14 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న చంద్రబాబుపై అవినీతి మచ్చ లేదు. ఆయన తలుచుకుంటే వేల కోట్లు అవినీతి చేయలేరా? ఆఫ్ట్రాల్ రూ.300 కోట్లు అవినీతి చేస్తారా? ఇది నిజంగా హాస్యాస్పదమే. జనానికి ఈ విషయం అర్థమైంది. ఆయనకు సింపతి పెరిగింది. ఇక్కడ వైసీపీపై వ్యతిరేకత వచ్చింది. ఇప్పుడు మీడియా ముందుకు ఏదో పలుకుబడి కలిగిన ముఠా కాపాడుతోందంటూ ఆరోపణలు షురూ చేశారు సీఎం.