స్కిల్ డెవలప్‌మెంట్ అక్రమ కేసులో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు క్వాష్ పిటిషన్‌పై ఏపీ హైకోర్టులో ఇవాళ విచారణ జరిగింది. నేడు ఈ కేసుకు సంబంధించి మూడు పిటిషన్లపై విచారణ జరిగింది. చంద్రబాబు తరుఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్దార్థ్ లూద్రా, పోసాని, దమ్మలపాటి శ్రీనివాస్, గింజుపల్లి సుబ్బారావు వాదనలు వినిపించారు. సీఐడీ తరఫున న్యాయవాదులు అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర రెడ్డి వాదనలు వినిపించారు. ఇరువర్గాల వాదనలనూ విన్న హైకోర్టు విచారణ వచ్చే మంగళవారా(ఈ నెల 19)నికి వాయిదా వేసింది. క్వాష్ పిటిషన్‌పై కౌంటర్ దాఖలుకు సీబీఐ సమయం కోరగా.. హైకోర్టు విచారణను వాయిదా వేసింది.
సాక్ష్యాలు లేకున్నా కేసు పెట్టారు..
చంద్రబాబుపై ఎఫ్ఐఆర్ కొట్టి వేయాలని ఆయన తరుఫు న్యాయవాదులు కోర్టును కోరారు. ఇక తన క్వాష్ పిటిషన్‌లో చంద్రబాబు.. యాంటీ కరప్షన్ యాక్ట్ సెక్షన్-13, ఐపీసీ 409 చెల్లవని పేర్కొన్నారు. కేవలం రాజకీయ ప్రతీకారం తీర్చుకోవడంలో భాగంగానే సాక్ష్యాలు లేకున్నా కేసు పెట్టారని పిటిషన్‌లో చంద్రబాబు లాయర్లు వివరించారు. సీఐడీ తరుఫు న్యాయవాదులు మాత్రం తాము అన్ని ఆధారాలతోనే రిపోర్టు ఇచ్చామని కోర్టుకు తెలిపారు. ఈ క్రమంలో అభ్యంతరాలు ఉంటే వేరే బెంచ్‌కు మారుస్తామని చంద్రబాబు లాయర్లకు కోర్టు తెలిపింది. దీనిపై స్పందించిన సిద్దార్థ్ లూథ్రా తమకు ఎలాంటి అభ్యంతరాల్లేవని తెలిపారు.
18 వరకూ విచారణ వద్దు..
కాగా.. చంద్రబాబును కస్టడీకి ఇవ్వాలన్న పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ విషయంలో చంద్రబాబుకు బిగ్ రిలీఫ్ ఇచ్చింది. ఈ నెల 18 వరకు ఈ పిటిషన్‌పై ఎలాంటి విచారణ చేపట్టవద్దని హైకోర్టు ఆదేశించింది. చంద్రబాబును వచ్చేసోమవారం వరకూ కస్టడీకి తీసుకోవద్దని సీఐడీకి రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. ఇటు చంద్రబాబు, అటు సీఐడీ తరుఫు న్యాయవాదులిద్దరి వాదనలూ విన్న మీదట.. కోర్టు 18 వరకూ విచారణ చేపట్టవద్దని ఆదేశాలు జారీచేసింది. మరోవైపు.. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కూడా వాయిదా వేసింది. ఈ పిటిషన్‌పై విచారణను కూడా ఈ నెల 19కి హైకోర్టు విచారణ వాయిదా పడింది.