కర్రలతో భద్రతేందీ సామీ.. ఆయనేమైనా సామాన్యుడా? మాజీ ముఖ్యమంత్రి.. మరీ ఇంత దారుణమా? రాజమండ్రి సెంట్రల్ జైలులో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు భద్రత గురించి తెలిసిన వారంతా చేస్తున్న చర్చ ఇదే. జగన్ సర్కారు అధికారం చేపట్టాక ఎటు చూసినా అప్పులే. ఆయన నిర్వహించలేక మూతేసిన వాటిలో జైళ్లు కూడా ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. ఇక మూసేసిన జైళ్లలోని ఖైదీలను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. ఖైదీలేమో ఎక్కువ.. సిబ్బందేమో దారుణం. 1800 మంది ఖైదీలకు 400 మంది సిబ్బంది. వీరంతా షిఫ్టుల వారీగా విధుల్లో ఉంటారు.
ఎందుకిలా..?
ఒకవేళ ఖైదీలు తిరగబ్డారో సిబ్బంది దగ్గర ఆయుధాలు కూడా ఉండవు. కేవలం కర్రలే. ఇక చంద్రబాబుకు కూడా కర్రలతోనే కాపలా ఉంటున్నారు. ప్రస్తుతం చంద్రబాబు స్నేహ బ్లాక్‌లో ఉన్నారు. ప్రధాన గేటు నుంచి ఇది సుమారు 50 మీటర్ల దూరంలో ఉంటుంది. దీనికి చుట్టూ ప్రహరీ ఉన్నా ఇది పూర్తి స్థాయిలో రక్షణనిస్తుందని చెప్పలేం. ఎన్ఎస్‌జీ కమెండోల భద్రతను కలిగి ఉండే చంద్రబాబుకు జైలులో మాత్రం భద్రత కరువైంది. అందుకేనేమో నిన్న ప్రముఖ న్యాయవాది సిద్ధార్థ లూద్రా చంద్రబాబుకు ప్రాణ హాని ఉందన్నారు. ఎన్ఎస్‌జీ కమెండోలతో జడ్ ప్లస్ భద్రత ఉంటేనే వైసీపీ శ్రేణులు ఆయనపై దాడులకు పాల్పడుతున్నాయి.
టీడీపీ క్యాడర్‌లో ఆందోళన
ఈ విషయమై ఎన్ఎస్‌జీ స్వయంగా ఆందోళన వ్యక్తం చేస్తే.. కేంద్రం చంద్రబాబు భద్రతను రెట్టింపు చేసింది. ఆ వెంటనే జగన్ సర్కారు ఆయనకు రక్షణగా ఉన్న రాష్ట్ర పోలీసులను తగ్గించడంతో చంద్రబాబు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో జగన్ సర్కార్ వెనక్కి తగ్గింది. అలాంటి భద్రత నడుమ ఉన్న చంద్రబాబుకి జగన్ సర్కారు కేవలం కర్రలతో భద్రత కల్పిస్తుండటం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఇప్పటికే వైసీపీ శ్రేణులు పలుమార్లు చంద్రబాబుపై జరిపిన దాడుల్లో ఆయన మాత్రమే కాకుండా.. ఆయన కమెండోలు సైతం గాయపడిన ఘటనలు ఉన్నాయి. ప్రస్తుతం టీడీపీ క్యాడర్‌ను చంద్రబాబు భద్రత అంశం ఆందోళనకు గురి చేస్తోంది.
నిన్న లూథ్రా, నేడు భువనేశ్వరి..!
సోమవారం నాడు చంద్రబాబును హౌస్ కస్టడీ ఇవ్వాలని సిద్ధార్థ లూథ్రా ఎలాంటి అనుమానాలు అయితే వ్యక్తం చేశారో.. ఇవాళ చంద్రబాబుతో ములాఖత్ తర్వాత ఆయన సతీమణి నారా భువనేశ్వరి మీడియాతో మాట్లాడుతూ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. సుమారు 40 నిమిషాలపాటు సాగిన ములాఖత్‌లో పలు విషయాలు కుటుంబ సభ్యులు చర్చించుకున్నారు. ‘చంద్రబాబు ఎప్పుడూ ఏపీ అభివృద్ధి కోసమే మాట్లాడేవారు. ప్రజలు ముందు.. కుటుంబం తర్వాత అని బాబు అంటుండేవారు. నాకు ప్రజలు ముఖ్యమని చంద్రబాబు చెప్పేవారు. ఏపీని నెంబర్‌వన్‌గా నిలబెట్టాలని జీవితాన్ని ధారపోశారు. ఇది మా కుటుంబానికి కష్టకాలం.. చంద్రబాబు భద్రత గురించే నాకు భయంగా ఉంది. జైల్లో ఎలాంటి ప్రత్యేక సౌకర్యాలు లేవు. చంద్రబాబు కట్టిన జైల్లోనే ఇప్పుడు ఆయన్ను కట్టిపడేశారు. లేనిపోని కేసులతో బాబును ఇబ్బంది పెడుతున్నారు. చంద్రబాబుకు సరైన వసతులు కల్పించడంలేదు. కనీసం లోపల వేడి నీళ్లు కూడా లేవు’ అని భువనేశ్వరి అనుమానం వ్యక్తం చేశారు. చూశారుగా.. జైలు ఉండే తీరు, లాయర్ లూథ్రా, ములాఖత్ తర్వాత భువనేశ్వరి మాట్లాడిన మాటలు.. ఇప్పటికైనా ప్రభుత్వం, సీఐడీ నిద్ర మేల్కోవాలని టీడీపీ శ్రేణులు డిమాండ్ చేస్తున్నాయి.. ఏం జరుగుతుందో చూడాలి మరి.