టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్‌తో ఓ పేరు తెగ వైరల్ అవుతోంది. అది ‘స్నేహ’. ఎవరీ స్నేహ? ఈ స్నేహకు బాబుకు ఏంటి సంబంధం అనకండి. స్నేహ అనేది రాజమండ్రి సెంట్రల్ జైలులోని ఒక బ్లాక్ పేరు. ఆర్థిక నేరాల్లో రిమాండ్‌పై వచ్చే ఖైదీలకు ఈ బ్లాక్ కేటాయిస్తారు. ప్రస్తుతం స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో చంద్రబాబుకు కోర్టు 14 రోజుల పాటు జ్యుడీషియరీ రిమాండ్ విధించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయను స్నేహ బ్లాక్‌ను కేటాయించడం జరిగింది. దీంతో ఒక్కసారిగా స్నేహ బ్లాక్ హాట్ టాపిక్ అయిపోయింది.
1602లో డచ్ దేశస్థులు నిర్మించిన కోటను బ్రిటీషర్లు 1864లో జైలుగా మార్చారు. ఆ తరువాత 1870లో పూర్తి స్థాయి కేంద్ర కారగారంగా ఇది మారిపోయింది. ప్రస్తుతం అత్యంత భద్రత గల జైలుగా ఇది పేరుగాంచింది. ఇది నిర్మించి150 ఏళ్లు పైబడుతున్నా ఇప్పటికీ చెక్కు చెదరలేదు. అయితే దీనిలో 11 బ్లాకులు ఉన్నాయి. వీటిలో కొన్నింటినీ ఇటీవల అధునాతనీకరించారు. వాటిలో ఒకటి స్నేహ బ్లాక్. దీనిలో 13 గదులు ఉంటాయి. అంతకు ముందు ఈ బ్లాక్‌లో ఉన్న ఖైదీలందరినీ చంద్రబాబు కోసం ఖాళీ చేయించారు.
ఈ 13 గదుల్లో ఒకదానిని చంద్రబాబు కోసం అత్యంత సౌకర్యవంతంగా తయారు చేశారు. ప్రస్తుతం స్నేహ బ్లాక్‌లోని బ్యారక్ మొత్తం ఆయనకే కేటాయించి అటు వైపు ఎవరినీ వెళ్లనివ్వకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. గదిలో ఏసీ నుంచి న్యూస్ పేపర్ వరకూ ఏర్పాటు చేశారు. ఒక్క టీవీ మినహా అన్ని ఏర్పాట్లు ఉన్నాయి. ఇక 24 గంటలూ ఆయన కోసం వైద్యుడిని ఏర్పాటు చేశారు. అలాగే చంద్రబాబుకు మెడిసిన్, భోజనం వంటివి ఇచ్చేందుకు ఒక మనిషిని సైతం కేటాయించారు. నలుగురు వ్యక్తిగత భద్రతా సిబ్బందితో పాటు 24 గంటల పాటు జైలు సిబ్బందితో పహారా ఏర్పాటు చేశారు.