జూనియర్ ఎన్టీఆర్‌పై మరోసారి ఏపీ వ్యాప్తంగా ఆగ్రహ జ్వాలలు మిన్నంటుతున్నాయి. టీడీపీకి కష్టం వస్తే.. తానెప్పుడూ అండగా ఉంటానంటూ ఒకప్పుడు చెప్పిన జూనియర్ ఎన్టీఆర్ ఎన్ని కష్టాలు వచ్చినా కూడా పార్టీ వైపు తిరిగి చూడటం లేదు. పోనీలే పార్టీ వైపు చూడకుంటే చూడకున్నాడు.. కనీసం జరుగుతున్న పరిణామాలపై అయినా స్పందించవచ్చు కదా? అదీ లేదు. ఆయన తండ్రి హరికృష్ణ జీవించి ఉన్నంతకాలం చంద్రబాబుకు అండగానే ఉన్నారు. చివరకు ఎన్టీఆర్ సోదరి సుహాసిని సైతం పార్టీకి అండగా ఉంటున్నారు. కానీ ఎన్టీఆర్‌కు ఏమైంది..? అనేది తెలియని పరిస్థితి. దీంతో జూనియర్‌పై టీడీపీ కార్యకర్తలు, సొంత అభిమానులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.
మీకు పట్టదా..?
ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మారుస్తున్నా.. పట్టించుకున్న పాపాన పోలేదు. కనీసం అదేంటని ట్విటర్ వేదికగా ఒక ట్వీట్ పడేసింది లేదు. తన మేనత్తను భువనేశ్వరిని ఏపీ అసెంబ్లీ సాక్షిగా తూలనాడుతున్నా.. పల్లెత్తి మాట్లాడలేదు. ఇప్పుడు చంద్రబాబును అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినా కూడా కనీసం ఒక్క ట్వీట్ వేయలేదు. అసలు.. మొన్నటికి మొన్న తనకు ఈ పొజిషన్ రావడానికి కారణమైన స్వర్గీయ ఎన్టీఆర్ రూ.100 కాయిన్ విడుదల కార్యక్రమానికే జూనియర్ ఎన్టీఆర్ హాజరు కాలేదు. ఆయనకు కేవలం నందమూరి ఇంటి పేరు కావాలి కానీ నందమూరి కుటుంబంతో మాత్రం పని లేదని దీంతో స్పష్టమవుతోంది. చంద్రబాబుపై కోపం ఉంటే ఎన్టీఆర్ ఏం చేశారు? ఆయన కాయిన్ విడుదల కార్యక్రమానికి హాజరు కావాలి కదా?
ఏమిటీ రచ్చ..?
ఏ ఒక్క సందర్భంలోనూ టీడీపీకి ఎన్టీఆర్ అండగా నిలుస్తున్నది లేదు. పైగా ఫ్యాన్స్ చేస్తున్న రచ్చను సైతం నిలువరిస్తున్నది లేదు. ఎక్కడ టీడీపీ సభ జరిగినా కూడా ఆయన ఫ్యాన్స్ ఆయన పేరు తీసుకొచ్చి నానా రచ్చ చేస్తున్నారు. అయినా కూడా అదేమని ప్రశ్నిస్తున్నది లేదు. తాజాగా జరుగుతున్న పరిణామాలతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఏకంగా ఓ ఫ్లెక్సీ ఏర్పాటు చేసి మరీ చంద్రబాబును నీచాతి నీచంగా చూపిస్తున్నారు. ఈ ఫ్లెక్సీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. టీడీపీ అధినేత ఇప్పుడున్న పరిస్థితుల్లో పుండు మీద కారం చల్లినట్టుగా ఇలాంటి చర్యలు అవసరమా? అసలే ఎన్టీఆర్ స్పందించలేదని క్యాడర్ రగిలిపోతుంటే ఇలాంటి పనులు చేసి ఆయన ఫ్యాన్స్ టీడీపీ క్యాడర్‌లో అసహనాన్ని మరింత పెంచుతున్నాయి. ఇప్పటికైనా ఎన్టీఆర్ కల్పించుకుని ఫ్యాన్స్‌ని అదుపులో పెట్టుకుంటే మంచిదని టీడీపీ నేతలు చెబుతున్నారు.