స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో సీఐడీ పోలీసులు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును సీఐడీ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆయనకు కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. ప్రస్తుతం చంద్రబాబు అంశం ఏపీలో కాకరేపుతోంది. ఆయన అరెస్ట్‌తో పొలిటికల్ హీట్ బీభత్సంగా పెరిగిపోయింది. ఎక్కడికక్కడ టీడీపీ నేతలు, కార్యకర్తలు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ఇది కేవలం ప్రభుత్వం కుట్ర అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కావాలనే చంద్రబాబును ఈ కేసులో ఇరికించారంటూ తెలుగు తమ్ము్ళ్లు మండిపడుతున్నారు. ఇప్పటి వరకూ అవినీతి మచ్చ అనేది నేతను ఇలా రిమాండ్‌కు తరలించడం అన్యాయమంటూ మండిపడుతున్నారు.
ఇదిలా ఉండగా.. చంద్రబాబు కేసును వాదించిన ప్రముఖ లాయర్ సిద్దార్థ్ లూద్రా నేడు సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుకి ప్రాణ హాని ఉందని మీడియాతో జరిపిన చిట్ చాట్‌లో ఆయన వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో చంద్రబాబును జైల్లో ఉంచడం ఏమాత్రం మంచిది కాదన్నారు. ఈ రోజు విజయవాడ ఏసీబీ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేయనున్నట్టు సిద్దార్థ్ లూద్రా వెల్లడించారు. చంద్రబాబు హౌస్ అరెస్ట్ పిటిషన్‌పై తమ వాదనలు వినిపిస్తామన్నారు. గతంలో వెస్ట్ బెంగాల్‌కు చెందిన మంత్రుల విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఈ సందర్భంగా ప్రస్తావిస్తామని వెల్లడించారు. ఈ కోర్టులో బెయిల్ వచ్చే అవకాశం లేదు కాబట్టి హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేయనున్నట్టు సిద్దార్థ్ లూద్రా వివరించారు.
సిద్దార్థ్ లూద్రా వ్యాఖ్యలు రాష్ట్రంలో సంచలనం రేపుతున్నాయి. చంద్రబాబుకు ప్రాణ హాని ఉందన్న వ్యాఖ్యలతో తెలుగు తమ్ముళ్లు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. అసలే రెండు రోజుల పాటు నిద్ర లేకపోవడంతో చంద్రబాబు కళ్లు ఉబ్బిపోయాయి. మీడియాలో చంద్రబాబును చూసిన టీడీపీ నేతలు, కార్యకర్తలు ఒకింత ఆందోళనకు గురవుతున్న సమయంలో సిద్దార్థ్ లూద్రా చేసిన వ్యాఖ్యలు మరింత కలవరానికి గురి చేస్తున్నాయి. చంద్రబాబుకు ప్రాణ హాని ఉందన్న న్యూస్ ఏపీలో తెగ వైరల్ అవుతోంది. మరోవైపు టీడీపీ నేతలు సైతం ఇవే వ్యాఖ్యలు చేస్తుండటం మరింత కల్లోలం రేపుతున్నాయి.