అసలే ఏపీ రాజకీయాలు మాంచి కాకమీదున్నాయి. చూడబోతే ఎన్నికల శంఖారావం ప్రారంభమైనట్టే అనిపిస్తోంది. ఈ సమయంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్ట్ రాజకీయాలను మరింత హీటెక్కించింది. ఇలాంటి తరుణంలో ఒక్క విషయం జన సైనికులను ఇబ్బంది పెడుతోంది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ రంగంలోకి దిగి జరుగుతున్న అన్యాయాలను ఏకి పారేయాల్సింది పోయి సినిమాలు చేసుకోవడమేంటి? ఇప్పుడు పాలిటిక్స్ కదా.. ముఖ్యం. ఒక పార్టీకి అధినేతగా ఉన్నప్పుడు పవన్ సైలెంట్ అవడం అందరినీ షాక్‌కు గురి చేస్తోంది.
ఒకవైపు డిసెంబర్‌లో జమిలీ ఎన్నికలకు కేంద్రం రంగం సిద్ధం చేస్తోంది. మరోవైపు చంద్రబాబు అరెస్ట్ వంటి పరిణామాల నేపథ్యంలో పవన్ నిజానికి రాజకీయాల్లో ఫుల్ బిజీ అయిపోవాలి. కానీ ముందుగా ఒప్పుకున్న సినిమాలను పూర్తి చేసి ఎన్నికల సమయం నాటికీ పూర్తిగా రాజకీయాల్లో బిజీ కావాలని పవన్ చూస్తున్నారు. కానీ రాజకీయాలకు సమయం ఎక్కువ కేటాయిస్తే మంచిదనే అభిప్రాయం పార్టీ కార్యకర్తల నుంచి వ్యక్తమవుతుంది. వారాహి యాత్ర సమయంలో పవన్‌కు ఓ రేంజ్‌లో స్పందన వచ్చింది. కానీ ఆ టెంపోను ఆయన కంటిన్యూ చేయకపోవడం విస్మయాన్ని కలిగిస్తోంది. ఫ్యామిలీతో గడపేందుకు కొన్నాళ్లు విదేశాలకు వెళ్లారు. అక్కడి నుండి తిరిగివచ్చాక సినిమా షూటింగ్‌లలో బిజీ అయ్యారు.
మరి పాలిటిక్స్‌ను పక్కన పడేస్తే ఎలా? మరో రెండు వారాల పాటు సినిమా షూటింగ్ లతో పవన్ గడపనున్నారని తెలుస్తోంది. ఆ తరువాత మరోసారి వారాహి యాత్ర నిర్వహిస్తారట. ప్రతి నెలా రెండు వారాలు షూటింగ్, మరో రెండు వారాలు రాజకీయాలకు సమయం కేటాయిస్తారట. ఇలా అయితే ఎలా? గతంలో కూడా షూటింగ్ గ్యాప్‌లో వచ్చి పవన్ రాజకీయాలపై స్పందించి వెళుతుంటారని ప్రచారం బీభత్సంగా నడిచి కేవలం జనసేన ఒక్క సీటుకే పరిమితమైంది. ఈసారి కూడా అలాగే చేస్తే పార్టీకి ఇబ్బంది తలెత్తే పరిస్థితి లేకపోలేదని జనసైనికులు అంటున్నారు. సినిమాలు పార్టీకి ప్లస్ అయ్యేలా పొలిటికల్ పంచ్‌లతో తీస్తున్నారు ఓకే కానీ పవన్ ప్రజల మధ్య ఉండకుంటే కష్టమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.