టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ ఏపీలో కాక రేపింది. అసలు ఇంతకు మించిన బర్నింగ్ టాపిక్ మరొకటి ఉండదనే చెప్పాలి. ఇక దీనికి సంబంధించి ఓ న్యూస్ తెగ ఆసక్తికరంగా మారింది. టీడీపీ అంటే ఛోటా పార్టీయేం కాదు.. పోనీ క్యాడర్ లేని పార్టీ కూడా కాదు. బడా బడా నేతలు.. బీభత్సమైన క్యాడర్ ఉన్న పార్టీ. మరి ఇంత క్యాడర్ ఉండి.. చంద్రబాబు అరెస్ట్ వార్త తెలిసి కార్యకర్తలంతా రోడ్లపైకి వచ్చినా కూడా ఎక్కడా ఎలాంటి విధ్వంసమూ జరగకపోవడం ఆసక్తికరంగా మారింది. చంద్రబాబు అరెస్ట్ వార్తతో ఏపీ అట్టుడికి పోవడం ఖాయమనుకున్న వారికి ఇది బిగ్ షాక్.
నిజమే.. ఏపీ అతలాకుతలం అయిపోవాలి. ఏపీలో బీభత్సమైన అల్లర్లు జరుగుతాయని భావించిన పోలీసులు ముందుగానే పార్టీ కీలక నేతలందరినీ అదుపులోకి తీసుకున్నారు. అయినా సరే.. కార్యకర్తలంతా రోడ్లపైకి పెద్ద ఎత్తున బయటకు వచ్చారు. కానీ ఎక్కడా శృతి మించిన ఆందోళనలు లేవు. ఎలాంటి బీభత్సమూ లేదు. ఇది అందరినీ నివ్వెరపరిచింది. అల్లర్లు జరుగుతాయని భావించిన ప్రభుత్వం ఎక్కడికక్కడ పోలీసు బలగాలను రంగంలోకి దింపింది. కానీ జనం మాత్రం చాలా సంయమనం పాటించారు. కేవలం చంద్రబాబు నంద్యాల నుంచి విజయవాడ తరలిస్తున్నప్పుడు మార్గం మధ్యలో.. అద్దంకి, చిలకలూరిపేట లో మాత్రమే కొందరు కార్యకర్తలు చంద్రబాబు కాన్వాయ్‌కి, సీఐడీ వాహనాలకు అడ్డుపడి ప్రతిఘటించారు. అంతకుమించి ఇంకెక్కడ పెద్ద సంఘటనలు చోటు చేసుకోలేదు.
చంద్రబాబు అరెస్ట్ వార్తలు ముందుగానే బయటకు వచ్చాయి. అసలు శుక్రవారం అర్ధరాత్రి నుంచే హైడ్రామా నడిచింది. చంద్రబాబు తన అరెస్టు అవుతానని రెండు మూడు రోజులు ముందే చెప్పారు. ఈ క్రమంలోనే పార్టీ కార్యకర్తలను ఎక్కడికక్కడ సన్నద్ధం చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకూ పాల్పడకుండా తమ పార్టీ క్యాడర్‌ను సిద్ధం చేయడంలో పార్టీ నేతలంతా సక్సెస్ అయ్యారు. నిజానికి ఇది రాష్ట్ర ప్రభుత్వానికి ఊహించని షాకే. అలాగే టీడీపీ పెద్ద నాయకులు తప్ప మరెవరూ మీడియా ముందుకు రాలేదు. మొత్తానికి ఒక వ్యూహాత్మక మౌనం.. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకూ పాల్పడకుండా క్యాడర్‌ను నిలువరించి టీడీపీ నేతలు.. అధికార పార్టీకి ఊహించని షాక్ ఇచ్చారు.