తెలుగు రాష్ట్రాల్లో స్కిల్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఈ ప్రాజెక్టులో వందల కోట్ల స్కాం జరిగిందంటూ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును ఏపీ ప్రభుత్వం అరెస్ట్ చేసింది. అసలు ఏంటి స్కిల్ డెవలప్‌మెంట్ కేసు? అసలు ఈ కేసులో నిజంగానే స్కాం జరిగిందా? చంద్రబాబు పాత్ర ఏ మేరకు ఉంది? వంటి విషయాల్లోకి వెళితే.. రాష్ట్ర విభజనతో ఏపీ తీవ్రంగా నష్టపోయింది. ఇక రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలంటే ముఖ్యంగా పారిశ్రామిక, ఉపాధి రంగాలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని భావించిన చంద్రబాబు స్కిల్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టును ప్రారంభించారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా పారిశ్రామిక, వాణిజ్య అవసరాలకు అనుగుణంగా విద్యార్థులు, నిరుద్యోగ యువతలో కీలక రంగాల్లో శిక్షణ ఇచ్చి వారిని నిపుణులుగా తీర్చిదిద్దాలని భావించారు.
భారత్ సహా అనేక దేశాల్లో నిరుద్యోగ యువతకు శిక్షణ ఇస్తున్న సీమెన్స్ సంస్థ ఏపీ ప్రభుత్వాన్ని అప్పట్లో కలిసింది. గుజరాత్‌లో అప్పటికే ఈ సంస్థ నైపుణ్య శిక్షణలో సత్ఫలితాలు సాధించిందన్న నివేదికల నడుమ చంద్రబాబు ఓ అడుగు ముందుకు వేశారు. సీమెన్స్ సాఫ్ట్‌వేర్‌ను అందిస్తుంది. మరో సంస్థ డిజైన్‌టెక్ శిక్షణకు సంబంధించిన ఇతర అవసరాలు, బాధ్యతలను నిర్వర్తిస్తుంది. మొత్తానికి 2015 జూన్ 30న స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌కు, సీమెన్స్, డిజైన్‌టెక్ కంపెనీలకు మధ్య ఒప్పందం (ఎంఓయూ) కుదిరింది. సీమెన్స్ ప్రాజెక్టులో ఆరు క్లస్టర్లుంటాయి. వీటి మొత్తం విలువ రూ.3359 కోట్లు. దీనిలో 10 శాతం అంటే రూ.330 కోట్లు ప్రభుత్వ వాటా. పదేళ్ల ఒప్పందం. అయితే ప్రభుత్వ వాటాను ముందుగానే చెల్లించాలని సీమెన్స్ కోరడంతో అప్పటి ప్రభుత్వం రెండు విడతల్లో టాక్స్‌లతో కలిపి రూ.370 కోట్ల నిధులను విడుదల చేసింది. ఆ వెంటనే సీమెన్స్ ఆ నిధులతో 40 ఇంజనీరింగ్ కాలేజీలు, విద్యా సంస్థల్లో శిక్షణకు అవసరమైన మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడంతో 2016 నవంబర్‌లో శిక్షణ ప్రారంభమైంది. ఇది ఇప్పటికీ కొనసాగుతోంది.
స్కిల్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టులో భాగంగా ప్రభుత్వం తన వంతు వాటా రూ.370 కోట్లను విడుదల చేసింది. దీనిలో సీమెన్స్‌కు రూ.48.72 కోట్లు ఇవ్వగా... మిగిలిన నిధుల్లో రూ.241.78 కోట్లను స్కీల్లర్ ఎంటర్ ప్రైజెస్ అనే కంపెనీకి చెల్లింపులు చేశారు. ఈ స్కీల్లర్ ప్రైజెస్ కంపెనీ నుంచి అలైడ్ కంప్యూటర్స్ ఇంటర్నేషనల్‌కి చెల్లింపులు జరిగాయి. అయితే డిజైన్‌టెక్ సంస్థ పన్నుల ఎగవేసేందుకు తక్కువ లావాదేవీలు చూపించి దాదాపు రూ.7 కోట్ల పన్నులు ఎగ్గొట్టిందని పుణెకు చెందిన జీఎస్టీ ఇంటెలిజెన్స్ విభాగం 2017లో నిర్ధారించింది. ఈ సంస్థపై అప్పట్లో కేసు కూడా నమోదైంది. ఈ సంస్థల పన్ను ఎగవేత, వాటి అంతర్గత ఆర్ధిక లావాదేవీలతో నాటి ముఖ్యమంత్రి చంద్రబాబుకు లింకులు పెట్టి.. షెల్ కంపెనీల ద్వారా డబ్బులు మళ్లించారని... ఆ డబ్బంతా చంద్రబాబుకు వెళ్లిందనేది ప్రధాన ఆరోపణ. నిజానికి సీమెన్స్ సంస్థ జరిపిన అంతర్గత నివేదికలో సీమెన్స్ మాజీ ఎండీ సుమన్ బోస్, డిజైన్‌టెక్ ఎండీ కన్వేల్కర్‌లు షెల్ కంపెనీలు ఏర్పాటు చేసుకున్నట్టు తేలింది. వీటన్నింటినీ తొక్కిపట్టి చంద్రబాబే ఈ స్కాం చేసినట్టు జగన్ ప్రభుత్వం సృష్టిస్తోంది.