ఖుషి సినిమాకు వచ్చిన పాజిటివ్ టాక్, ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్‌తో విజయ్ దేవరకొండ తన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ.. తన ఫ్యామిలీ అని భావించి ఓ 100 మంది ఫ్యామిలీలకు ఒక్కో ఫ్యామిలీకి రూ. లక్ష చొప్పున రూ. కోటి రూపాయలు ఇస్తానని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే విజయ్ దేవరకొండ ఈ ప్రకటన చేసిన కాసేపటికే.. ఆయన అంతకు ముందు చేసిన వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాని డిస్ట్రిబ్యూట్ చేసిన నిర్మాత అభిషేక్ నామా.. ట్విట్టర్ వేదిక చేసిన ఓ ట్వీట్ సంచలనంగా మారింది.
అసలే.. ఒక వైపు విజయ్ దేవరకొండను తొక్కేయాలని ఇండస్ట్రీలో కొందరు పనిగట్టుకుని మరీ ప్రయత్నాలు చేస్తున్నారనేలా ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో.. సదరు నిర్మాత ఇలా ప్రకటన చేయడం ఇండస్ట్రీలో కాకరేపింది. విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ నిర్మాతని ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు. దమ్ముంటే.. స్టార్ హీరోలను కూడా ఇలా అడగాలి అంటూ కౌంటర్స్ సంధించారు.. సంధిస్తున్నారు. అయితే నిర్మాత నుండి తర్వాత ఎటువంటి రిప్లయ్ రాలేదు. ఇప్పుడా నిర్మాతకు విజయ్ దేవరకొండ తండ్రి గోవర్ధన్ రావు కూడా కౌంటర్ వదిలారు.
తాజాగా ఆయన పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో ఈ ప్రస్తావన రాగా.. ఆ సినిమా ఫ్లాపులో విజయ్‌కి సంబంధం లేకపోయినప్పటికీ.. నా కొడుకు పేరు పాడు చేయడానికి.. అభిషేక్ నామా ప్రయత్నిస్తున్నాడు. అతని బ్లాక్ మెయిల్ పాలిటిక్స్ ఇక్కడ పనిచేయవు. అసలా సినిమాకు పూర్తి రెమ్యూనరేషన్ కూడా విజయ్‌కి ఇవ్వలేదు. ఆ విషయం నిర్మాత కెఎస్ రామారావుకి తెలుసు. ఆ సినిమా తర్వాత తన బ్యానర్‌లో సినిమా చేయాలని అభిషేక్ నామా కలిశారు. కానీ.. అప్పటికే అంగీకరించిన సినిమాలు ఉన్నాయని.. ఇప్పుడు కుదరదని చెప్పాడు విజయ్. అది మనసులో పెట్టుకుని ఇప్పుడిలా చేస్తున్నాడు. భవిష్యత్‌లో అతనితో విజయ్ సినిమా చేయడు. ఖుషి సినిమా గురించి మాట్లాడే రైట్స్ అభిషేక్‌కి లేవు. విజయ్ మార్కెట్ పడిపోయిందని అంటూనే.. అతనితో సినిమా చేయాలని ప్రయత్నించడం చూస్తుంటే అభిషేక్ నామాది రెండు నాలుకల ధోరణి అనేది అర్థమవుతుంది. కావాలని ఎంత టార్గెట్ చేసినా.. విజయ్‌కి అభిమానుల బలం ఉంది.. అంతా వాళ్లే చూసుకుంటారంటూ విజయ్ తండ్రి గోవర్ధన్ రావు సంచలన కామెంట్స్ చేశారు.