బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ 4 నియోజకవర్గాలు మినహా 115 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ 4 నియోజకవర్గాలు హాట్ టాపిక్‌గా మారాయి. ఈ నాలుగింటిలో పాతబస్తీకి సంబంధించినవి రెండు కాగా.. జనగామ, నర్సాపూర్ స్థానాలను పక్కనబెట్టేశారు. పాతబస్తీ విషయంలో ఎవరూ పెద్దగా ఆసక్తి చూపడం లేదు కానీ పక్కనబెట్టిన రెండు స్థానాల విషయంలో మాత్రం ఎక్కడ లేని ఉత్కంఠ కొనసాగుతోంది. జనగామ, నర్సాపూర్ అభ్యర్థులుగా ఎవర్ని ఎంపిక చేస్తారు? అసలు ఎందుకు ఈ రెండు స్థానాలను పక్కనబెట్టారు? అనే విషయాలు హాట్ టాపిక్‌గా మారాయి. దీనిపై ఎవరికి నచ్చిన విశ్లేషణలు వారు చేసేస్తున్నారు.
ఇక ఈ రెండు అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన ఆశావహులు అయితే సీఎం కేసీఆర్ ఎప్పుడు ప్రకటిస్తారు? వాటిలో తమ పేరు ఉంటుందా? లేదా? అని కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. దాదాపు అన్ని నియోజకవర్గాలను సిట్టింగ్‌లకే కేటాయించిన కేసీఆర్.. నర్సాపూర్ నియోజకవర్గ సిట్టింగ్ ఎమ్మెల్యే మదనరెడ్డికి మాత్రం టికెట్ నిరాకరించారు. ఇప్పుడు ఇక్కడ ఎవరికి కేటాయిస్తారనేది ఆసక్తికరంగా మారింది. మాజీ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డికి ఈ టికెట్ కేటాయిస్తారంటూ టాక్ నడుస్తోంది. అయితే సునీతా లక్ష్మారెడ్డి వెళ్లి ఇప్పటికే సీఎం కేసీఆర్‌ను కలిసినా కూడా ఆమెకు హామీ ఇచ్చిన దాఖలాలైతే లేవు. పైగా మదన్‌రెడ్డి టికెట్ తనకే కేటాయించాలంటూ అధిష్టానంపై ఒత్తిడి తెస్తున్నారు. కేసీఆర్ మాత్రం ఈ స్థానంపై వేచి చూసే ధోరణిలో ఉన్నారు.
ఇక కేసీఆర్ హోల్డ్ చేసిన మరో స్థానం జనగామ. ఇక్కడ కూడా సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డికి కేసీఆర్ టికెట్ నిరాకరించారు. ఇక్కడ టికెట్ కేవలం కేటీఆర్ విదేశీ పర్యటనలో ఉన్నందునే కేసీఆర్ ఖరారు చేయలేదని టాక్. అయితే ఇక్కడి టికెట్ పల్లా రాజేశ్వరరెడ్డికి కేటాయించినట్టు ప్రచారం జరుగుతోంది. పల్లా కూడా ఈ క్రమంలోనే ద్వితీయ శ్రేణి నాయకత్వానికి అందుబాటులోకి వెళ్లిపోయారు. మరోవైపు ఇక్కడ టికెట్ కోసం వరంగల్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి కూడా పోటీ పడుతున్నారు. పోచంపల్లి వచ్చేసి కేటీఆర్ క్లాస్‌మేట్ కావడంతో టికెట్ తనకే ఇస్తారన్న ధీమాలో ఉన్నారు. మరి కేటీఆర్ వచ్చే వరకూ కేసీఆర్ ఆగుతారా? ఇక్కడి టికెట్ ప్రకటించేస్తారా? అనేది ఆసక్తికరంగా మారింది. ఇక నాంపల్లి, గోషామహల్ ఎలాగూ ఎంఐఎంకే కేటాయిస్తారు కాబట్టి ఈ రెండు స్థానాలపై పెద్దగా ఎవరూ ఆసక్తి చూపడం లేదు.