తానొకటి తలిస్తే దైవమొకటి తలిచారని.. ప్రస్తుతం వైఎస్సార్‌టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల ఒకటి తలిస్తే.. ఆమె అన్న, ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డి మరొకటి తలిచారు. మొత్తానికి షర్మిళను తన దారిలోకి అయితే తెచ్చుకున్నారని టాక్ నడుస్తోంది. అసలేం జరిగింది? షర్మిళ కాంగ్రెస్‌లోకి చేరేందుకు బ్రేక్ పడిందంటూ ఓ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇప్పటికే పొంచి ఉన్న ఇబ్బందులకు తోడు.. షర్మిళ కాంగ్రెస్‌లో చేరితే శత్రు బలం మరింత పెరుగుతుందని భావించిన ఏపీ సీఎం జగన్ స్కెచ్ మార్చేశారా? అసలేం జరిగింది?
షర్మిళ కాంగ్రెస్‌లో చేరేందుకు సర్వం సిద్ధమైన విషయం తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ ఆమెకు ఏపీ బాధ్యతలు అప్పగించాలని కాంగ్రెస్ అధిష్టానం భావించిందన్న న్యూస్ కూడా చాలా రోజులుగా సర్క్యులేట్ అవుతూ వస్తోంది. అయితే ఇప్పుడు ఆ ప్రక్రియకు బ్రేక్ పడిందట. ఏపీలో బాధ్యతలు అప్పగించాలని భావించిన కాంగ్రెస్ అధిష్టానానికి జగన్ బ్రేకులు వేశారనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. షర్మిళ కాంగ్రెస్‌లో తనకు ఎదురు నిలిస్తే ఇబ్బంది అవుతుందని భావించిన జగన్ కొందరు కాంగ్రెస్ పెద్దల ద్వారా ఆమె పార్టీ మార్పునకు చెక్ పెట్టారని సమాచారం. దీనికి ప్రతిఫలంగా ఆమె కోరిన మేరకు ఆస్తుల పంపకానికి జగన్ సిద్ధమైనట్టు టాక్.
నిజానికి జగన్, షర్మిళ మధ్య ఆస్తి పంపకాల విషయంలోనే గొడవ జరిగిందని సమాచారం. అప్పటి నుంచే ఎవరికి వారు.. యమునా తీరుగా జీవితం సాగిస్తున్నారు. అయితే ప్రస్తుతం జగన్ కర్ణాటక ఉప ముఖ్యమంత్రి శివకుమార్, తమిళనాడు సీఎం స్టాలిన్ వంటి వాళ్ల సాయంతో కాంగ్రెస్ పెద్దలతో మాట్లాడి ఆమె ఆంధ్ర కాంగ్రెస్ కు పెద్ద దిక్కు కాకుండా ఆపినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ప్రచారంలో నిజం లేదని తెలుస్తోంది. ప్రస్తుతం జగన్ యూకే పర్యటనలో ఉన్నారు. ఇవన్నీ పట్టించుకునే పరిస్థితిలో కూడా లేరు. అందునా జగన్ ఒక పట్టాన ఓటమిని అంగీకరించే రకం కాదు. పైగా ఆస్తుల పంపకానికి ఆయన ఏమాత్రం అంగీకరించరు. అలాంటప్పుడు అసలు ఈ ప్రచారానికి అర్థమే లేదు.