బెంగుళూరులో కండక్టర్‌గా విధులు.. ఆపై ఆయన స్టైల్ చూసి సినిమాల్లో అవకాశం.. ఒక బస్ డ్రైవర్ కొన్ని లగ్జరీ కార్లకు అధిపతి.. బిలీయనీర్‌గా జీవితం.. లైఫ్ ఎంతో అద్భుతంగా సాగుతున్న తరుణంలో రాజకీయ రంగ ప్రవేశం వైపు అడుగులు.. ఆపై ఏం జరిగిందో ఏమో కానీ రజినీ మనసు మార్చుకున్నారు. అయితే ఇప్పుడు ఆయనను వెదుక్కుంటూ ఏకంగా గవర్నర్ పదవే ఆయన చెంతకు వచ్చిందని టాక్. తీర్థ యాత్రల పేరుతో అలా అలా తిరిగి వచ్చేసరికి ఆయనను గవర్నర్ పదవి వరించనుందంటూ ప్రచారం. ఈ ప్రచారం వెనుక కారణాలు లేకపోలేదు. మరి అవేంటి? అసలు ఆ తీర్థ యాత్రల్లో ఏం జరిగింది? అనే విషయాలపై ప్రత్యేక కథనం.
సూపర్ స్టార్ రజినీకాంత్‌కు బీజేపీ గవర్నర్ పదవి ఆఫర్ చేసిందంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ‘జైలర్’ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత రజినీకాంత్ తీర్థ యాత్రల పేరుతో పలు రాష్ట్రాల్లో పర్యటించారు. అయితే ఈ పర్యటనలో భాగంగా పలు పార్టీల నేతలను సైతం ఆయన కలిశారు. అయితే బీజేపీ నేతలను కలిసిన విషయం మాత్రం ఎందుకో హైలైట్ అయ్యింది. ఇక అంతే.. ఆయన తిరిగొచ్చేసరికి.. రజినీకి గవర్నర్ పదవి అంటూ ప్రచారం ప్రారంభమైంది. కానీ రజినీ ఈ ప్రచారంపై మౌనం వహించారు. తన అనారోగ్యం కారణంగా ఇకపై రాజకీయాల జోలికి వెళ్లనని ఒకరకంగా ప్రతిన పూనిన రజినీపై ఈ ప్రచారం ఊపందుకోవడానికి కారణాలు లేకపోలేదు.
దక్షిణాదిలో బీజేపీ బలోపేతానికి ఎన్ని అడుగులు ముందుకు వేస్తున్నా అది ఎందుకో సాధ్యపడటం లేదు. ఈ క్రమంలోనే తమిళనాడులో బలపడాలని బీజేపీ ఉవ్విళ్లూరుతోంది. ఈ క్రమంలోనే ఆ పార్టీకి రజినీకాంతే ఆశాదీపంలా కనిపిస్తున్నారు. రజినీ ఇమేజ్‌ను వాడుకుని ఎలాగైనా బలపడాలని బీజేపీ యత్నిస్తున్నట్టు టాక్ నడుస్తోంది. రజినీ కూడా యూపీకి వెళ్లి అక్కడి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కాళ్లు మొక్కడం హాట్ టాపిక్‌గా మారిపోయింది. రజినీకి గవర్నర్ పదవి ప్రచారానికి ఇదొక కారణం. మరి ఈ గవర్నర్ పదవి ప్రచారంలో నిజమెంత ఉందో తెలియాల్సి ఉంది. ఒకవేళ నిజమే అయినా కూడా రజినీ గవర్నర్ పదవికి అంగీకరిస్తారో లేదో వేచి చూడాలి.