అల్లు అర్జున్.. ఇప్పుడీ పేరు అంతర్జాతీయంగా సెన్సేషన్. పుష్ప సినిమాతో ప్రపంచస్థాయి గుర్తింపును సొంతం చేసుకున్న అల్లు అర్జున్.. రీసెంట్‌గా ప్రకటించిన నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్‌లో ఉత్తమ నటుడిగా ఎంపికయ్యారు. పుష్ప సినిమాలోని ఆయన నటనకు గానూ అల్లు అర్జున్ ఉత్తమ నటుడిగా సెలక్ట్ అయ్యారు. టాలీవుడ్ నుంచి ఇలా ఉత్తమ నటుడిగా అవార్డ్ గెలుచుకున్న మొట్టమొదటి హీరోగా బన్నీ రికార్డ్ క్రియేట్ చేశారు. అయితే అల్లు అర్జున్‌కి ఈ స్థాయి గుర్తింపు తీసుకువచ్చింది మాత్రం సుకుమార్ అనే చెప్పుకోవాలి. ఈ విషయం స్వయంగా బన్నీనే తన తాజా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.
నటుడిగా ఈ స్థాయిలో ఉండటానికి, అంతర్జాతీయ స్థాయి గుర్తింపు దక్కడానికి కారణం సుకుమారే అని గుండె మీద చేయి వేసుకుని మరీ చెప్పగలను అంటూ.. సుకుమార్ గురించి అల్లు అర్జున్ చెప్పుకొచ్చారు. ‘ఆర్య సినిమా సమయంలో మరి కొన్ని కథలూ విన్నా.. కానీ సుకుమార్‌గారితోనే నడవాలని డిసైడ్ అయ్యా. ఆరోజు ఆ నిర్ణయం తీసుకున్నాను కాబట్టే.. ఈరోజు నటుడిగా ఈ స్థాయిలో ఉన్నాను. ఆరోజు నేను వేరే నిర్ణయం తీసుకుని ఉంటే నా కెరియర్ కచ్చితంగా ఇలా అయితే ఉండేది కాదు.
నటుడిగా నిలదొక్కుకున్నాక రూ. 85 లక్షలు పెట్టి ఓ స్పోర్ట్స్ కారు కొన్నా. దాని స్టీరింగ్ పట్టుకోగానే ఈ కారు నా చేతికి రావడానికి కారణం సుకుమార్‌గారే అని అనిపించింది. తగ్గేదే లే అంటూ నన్ను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లింది సుకుమార్‌గారే. గుండె మీద చేయి వేసుకుని ఒక్క మాట చెప్పగలను... డార్లింగ్, నువ్వు (సుకుమార్) లేకపోతే నేను లేను అని. ఈ జీవితంలో కుటుంబం తరువాత నేను రుణపడి ఉండేది సుకుమార్‌గారికే..’ అని అల్లు అర్జున్ ఎమోషనల్ అయ్యారు.