జయం రవి - నయనతార జంటగా నటించిన ‘ఇరైవన్’ చిత్రం ప్రేక్షకులను ఓ రేంజ్‌లో భయపెడుతుందని ఆ సినిమా దర్శకుడు అహ్మద్ తెలిపారు. సెప్టెంబర్ 28న ఈ చిత్రం విడుదల కాబోతోన్న నేపథ్యంలో తాజాగా చిత్ర ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ ట్రైలర్ చూస్తుంటే నిజంగానే ఈ సినిమా తీవ్రంగా భయపెట్టబోతుందనేది అర్థమవుతోంది. ఈ సినిమాకున్న విశేషం ఏమిటంటే.. హర్రర్ జోనర్‌లో తెరకెక్కిన ఈ సినిమాలో విలన్‌ని ముందే చూపించడం. సైకో తరహా విలన్.. అమ్మాయిలను కిడ్నాప్ చేసి దారుణంగా చంపేస్తుంటాడు. ఆ విలన్‌ని పట్టుకోవడానికి స్పెషల్ ఆఫీసర్‌గా వచ్చిన హీరోకి అతను అసలు అర్థంకాని వ్యక్తిగా వన్.. టు.. త్రీ అంటూ కన్ఫ్యూజ్ చేస్తుండటం చూస్తుంటే.. ఈ సినిమాలోని వైవిధ్యత ఏమిటో అర్థం చేసుకోవచ్చు. ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా ఉండటమే కాకుండా.. సినిమాపై ఇంట్రస్ట్‌ని, భయాన్ని కలగజేస్తోంది.
ఈ సినిమా గురించి దర్శకుడు మాట్లాడుతూ.. తనీ ఒరువన్, బోగన్ వంటి చిత్రాల తర్వాత హీరో జయం రవి పోలీస్ అధికారి పాత్రలో కనిపిస్తున్నారు. ‘తనీఒరువన్’ చిత్రం తర్వాత జయం రవి - నయనతార జంటగా నటించిన చిత్రమిది. వీరిద్దరికి మూడు డ్యూయెట్సు ఉంటాయి. యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు. నయనతారకు పెళ్లికాకముందే ఈ చిత్ర షూటింగ్ మొదలుపెట్టాం. కరోనా కారణంగా ఆలస్యమైంది. హర్రర్ జోనర్‌లో ఈ సినిమాని తెరకెక్కించాం. ఈ కోణంలో ఇప్పటివరకు అనేక చిత్రాలు వచ్చాయి. కానీ, వాటికి భిన్నంగా ఈ చిత్రం ఉంటుంది.
సాధారణంగా ఏ సినిమాలో అయినా మనిషిని హత్య చేసే సన్నివేశం మాత్రమే చూపిస్తారు. కానీ, ఇందులో ఆ మనిషి హత్యకు గల కారణాలు, హత్య చేసే వారి మానసికస్థితిని వివరించే ప్రయత్నం చేశాం. ఈ సినిమా చూసే ప్రేక్షకులు కచ్చితంగా తీవ్ర భయానికి లోనవుతారని చెప్పగలను. తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం భాషల్లో విడుదల సెప్టెంబర్ 28న గ్రాండ్‌గా విడుదల చేస్తున్నాం. పొన్నియిన్ సెల్వన్ చిత్రం తర్వాత జయం రవికి ఫ్యాన్ ఫాలోయింగ్ దేశవ్యాప్తంగా పెరిగింది. ఇది ఈ సినిమాకు ప్లస్ అవుతుందని భావిస్తున్నానని తెలిపారు.