ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు హీట్ పుట్టిస్తున్నాయి. ఇక్కడ రిజల్ట్ ఎవరికి పూర్తి స్థాయిలో ఫేవర్‌గా ఉందన్నది ఇప్పుడే చెప్పలేం కానీ పొత్తులపై మాత్రం క్లారిటీ అయితే వస్తోంది. బీజేపీ, జనసేన, టీడీపీ కలిసి పోటీ చేయబోతున్నాయనేది రాజకీయ విశ్లేషకులు చెబుతున్న మాట. ఇప్పటి వరకూ పొత్తుల విషయం గురించి ఆలోచించలేదని టీడీపీ అధినేత చంద్రబాబు చెబుతున్నప్పటికీ ఆయన మాటలు మాత్రం మరోలా ఉన్నాయి. ‘ఇండియా కూటమికి లీడర్ లేడు. ఈ పాయింట్ మోదీకి అడ్వాంటేజ్ అవుతుంది’ అంటూ చంద్రబాబు చేస్తున్న వ్యాఖ్యల వెనుక సారాంశం పొత్తు వ్యవహారం పక్కా కావడమేనని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
ఈ సారి జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో కూడా బీజేపీ పక్కా విజయం సాధిస్తుందని చంద్రబాబు భావిస్తున్నారని పై వ్యాఖ్యలను బట్టి అర్థమవుతోందని.. ఈ క్రమంలోనే ఆయన పక్కా బీజేపీతో పొత్తు పెట్టుకోవడం ఖాయమంటున్నారు. ప్రస్తుత తరుణంలో బీజేపీతో దోస్తీ పెట్టుకుంటేనే బాగుంటుందని ఫీలవుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇప్పటి వరకూ సర్వేలన్నీ బీజేపీకే అనుకూలంగా ఉన్నాయి. అయితే ఒకవేళ ‘ఇండియా’ కూటమి పుంజుకుంటే మాత్రం బీజేపీతో పొత్తు టీడీపీకి చేటుగా మారే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. తాజాగా ఓ సర్వే టీడీపీ సింగిల్‌గా వెళ్లినా కూడా అధికారాన్ని దక్కించుకుంటుందని స్పష్టం చేసింది.
మరి ఈ సర్వేలతో తర్వాత చంద్రబాబు ఏమైనా మనసు మార్చుకుంటారో లేదంటే పొత్తుకే సై అంటారో చూడాలి. ఇక టీడీపీ, బీజేపీతో పొత్తు పెట్టుకుంటే మాత్రం వైసీపీ అధినేత జగన్ వ్యూహం మార్చే అవకాశం ఉందంటున్నారు. రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ మధ్యవర్తిత్వంతో ‘ఇండియా’ కూటమి వైపు జగన్ చూసినా ఆశ్చర్యపడాల్సిన అవసరం ఉండదని అంటున్నారు. బీజేపీతో పొత్తు విషయంలో చంద్రబాబు పునరాలోచించడం మేలని విశ్లేషకులు అంటున్నారు. టీడీపీకి దగ్గరయ్యేందుకు బీజేపీ అయితే శతవిధాలా ట్రై చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే పురందేశ్వరిని రాష్ట్ర అధ్యక్షురాలిగా నియమించిందని టాక్. గతంలో ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వనందున బీజేపీకి చంద్రబాబు దూరమయ్యారు. మరి ఇప్పుడు ఆ విషయాన్ని పక్కనబెట్టి మోదీ లీడర్ షిప్‌ను పొగడటమేంటని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఏపీలో బీజేపీపై ఏమాత్రం సానుకూలత లేదు. అలాంటి బీజేపీతో జతకట్టి చంద్రబాబు ప్రజా వ్యతిరేకతను కొని తెచ్చుకునే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.