సాగరతీరాన్ని రాజధానిగా మార్చాలని అధికార వైసీపీ శతవిధాలుగా యత్నిస్తోంది. అన్ని వనరులు ఉన్న విశాఖను వదిలి రాళ్లు తప్ప ఏమీ లేని అమరావతిని రాజధానిని చేసిందంటూ టీడీపీపై ఇప్పటికీ వైసీపీ దుమ్మెత్తిపోస్తోంది. ఈ క్రమంలోనే విశాఖను ఉన్నతంగా చూపాలని రకరకాల ప్రయత్నాలు చేసి విఫలమవుతోంది. ఈ క్రమంలోనే తాజాగా ఓ నిర్ణయం తీసుకుని దానిని అనుకున్నదే తడవుగా అమలు పరిచి బొక్క బోర్లా పడింది. ఇప్పుడు దానిపై ట్రోల్స్, మీమ్స్ మామూలుగా లేవు. మీ పరిపాలనకో దండం బాబోయ్.. ఎంత నొక్కేశారంటూ సోషల్ మీడియా వేదికగా సెటైర్ల మీద సెటైర్లు పడుతున్నాయి. విశాఖలో జీవీఎంసీ కార్యాలయం సమీపంలో వైసీపీ ప్రభుత్వం కొత్తగా నిర్మించిన బస్ బే కూలిపోవడం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
విశాఖ నగరంలో రూ.4 కోట్లకు పైగా వ్యయంతో నూతన బస్ బేల నిర్మాణం.. జీవీఎంసీ హడావుడిగా చేపట్టింది. ఈ మోడ్రన్ బస్ షెల్టర్‌కు విద్యుత్ కాంతులతో హంగులూ ఆర్భాటాలు చేసింది. అయితే జీవీఎంసీ సమీపంలోనే నిర్మించిన బస్ షెల్టర్ ఐదే ఐదు రోజుల్లో కుంగిపోయింది. దీనిని జీవీఎంసీ మేయర్ చాలా అట్టహాసంగా ప్రారంభించారు. పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టుగా ఇవి చూసేందుకు అధునాతనంగా.. అద్భుతంగా ఉన్నాయని కానీ నాణ్యతలో మాత్రం దారుణమని ప్రతిపక్షాలు ఎద్దేవా చేస్తున్నాయి. ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ బస్ షల్టర్‌ను నిర్మించి.. జోరుగా ప్రచారం చేసుకుని మరీ ప్రారంభిస్తే ఇది ఒక్కసారిగా పక్కకు ఒరిగిపోయి ఇజ్జత్ మొత్తం తీసి పాడైంది. ఆ సమయంలో ఎవరూ లేకపోబట్టి సరిపోయింది కానీ లేదంటేనా? ఎంత ప్రమాదం జరిగి ఉండేదో అని స్థానికులు అంటున్నారు.
రూ.లక్షలు ఖర్చుచేసి నిర్మించిన నిర్మాణం.. ప్రారంభించిన ఐదు రోజులకే కుంగిపోవడం చూసిన వారెవరికైనా ఆగ్రహం తెప్పించడం సహజమే కదా. ఇక ప్రతిపక్ష పార్టీలు దీనిపై మండిపడుతున్నాయి. కూల్చడమే కాని నిర్మించడం చేతకాని జగన్ ప్రభుత్వం కట్టిన బస్ బే కూలిపోవడం వైసీపీ సర్కారు పనితీరుకు నిదర్శనమంటూ నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. బస్ బే నిర్మాణంలో పెద్ద స్కాం జరిగిందని విశాఖవాసులు అభిప్రాయపడుతున్నారు. నెటిజన్లు అయితే సోషల్ మీడియా వేదికగానే ఎంత నొక్కేశారంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. మరీ ముఖ్యంగా ఈ ఘటనపై సోషల్ మీడియాలో మీమ్స్ రాయుళ్లు రెచ్చిపోతున్నారు. రూ.5 కోట్లు ఖర్చుపెట్టి ప్రభుత్వం నిర్మించింది 5 రోజులు కూడా నిలవని బస్ బేనా? అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. మొత్తానికి ఒక్క బస్ బే నిర్మించి ఏపీ ప్రభుత్వం ఇజ్జత్ మొత్తం జీవీఎంసీ తీసి పడేసింది.