ఏపీలో టీడీపీ ఏం చేసినా సరే.. విమర్శించే గొంతుకల్లో రోజా గొంతుక ఒకటి. ఆమె నోటికి హద్దుండదు. ఎవరినైనా ఇష్టానుసారంగా మాట్లాడుతుంది. ఒక్క టీడీపీనే కాదు.. జనసేన అధినేతను సైతం ఇష్టానుసారంగా మాట్లాడుతుంది. పర్సనల్ విషయాలు తీసి మరీ అసభ్యకరంగా మాట్లాడుతుంది. రోజా అంటే ప్రతిపక్షాల పార్టీల నేతలు మండిపడతారు. రంగుల రాణి అని.. డైమండ్ రాణి అంటూ ఏకి పారేస్తారు. ఇక వైసీపీ నేతలేమైనా తక్కువా? ఆమె అంటేనే ఎందుకోగానీ ఫైర్ అయిపోతున్నారు. అసలు ఇప్పుడు నగరిలో రోజాకు టీడీపీ నేతలతో కంటే సొంత పార్టీ నేతలతోనే ప్రమాదం పొంచి ఉందనేది బహిరంగ రహస్యం.
వైసీపీలో రోజాను వ్యతిరేకిస్తే చాలు ఆ నేతలకు పార్టీ పెద్దలు బ్రహ్మరథం పడుతున్నారు. రోజాను వ్యతిరేకించిన వారికి ఏవైనా పనులు కావాలంటే చకచకా అయిపోతాయి. వైసీపీ నేతలే ఆమెను ఓడించేందుకు పెద్ద స్కెచ్చే గీస్తున్నారు. దీనకోసం రోజా వ్యతిరేక వర్గీయులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు కూడా నేతలు వెనుకాడటం లేదంటే ఆమెపై సొంత పార్టీలో ఎంత వ్యతిరేకత ఉందనేది స్పష్టమవుతోంది. షాకింగ్ విషయం ఏంటంటే.. రోజా సొంత నియోజకవర్గంలోని ప్రతి మండలంలో కూడా ఒక కీలక నేత ఆమెకు వ్యతిరేకంగా పని చేస్తున్నాడని టాక్. ఇది ఇలాగే కొనసాగే వచ్చే ఎన్నికల్లో రోజా ఓటమి ఖాయం.
అయితే సొంత పార్టీలనే తనకు వ్యతిరేక వర్గం ఉందని.. ఆమెను ఓడించేందుకు సొంత పార్టీ నేతలే విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని రోజాకు కూడా తెలుసట. ఈ విషయాన్ని ఏపీ సీఎం జగన్ దృష్టికి కూడా రోజా తీసుకెళ్లారని సమాచారం. రోజా ఎంత మొత్తుకున్నా జగన్ అయితే దీనిపై ఎలాంటి చర్యలూ తీసుకున్న దాఖలాలు అయితే లేవు. అయితే ఈ నెల 28న చిత్తూరు జిల్లా నగరికి ముఖ్యమంత్రి వెళ్లనున్నారు. బటన్ నొక్కి విద్యాదీవెన లబ్ధిదారులకు డబ్బు జమ చేయనున్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గానికి చెందిన నేతలతో సమావేశమై వారికి జగన్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తే సరే సరి. లేదంటే మాత్రం ఈసారి నగరిలో రోజా ఓటమి ఖాయమని తెలుస్తోంది. మరి రోజాను జగన్ అయినా కాపాడుతారో లేదంటే వ్యతిరేక వర్గం స్ట్రాంగ్ కాబట్టి ఆమెను లైట్ తీసుకుంటారో చూడాలి.