ఒకప్పుడు రాజకీయం వేరు సినిమా రంగం వేరు. కానీ ఇప్పుడు ఒకదానిలో మరొకటి అంతర్లీనమై పోయాయి. ఇక ఈ సారి జరగనున్న ఎన్నికల్లో సినీ గ్లామర్‌కు పెద్ద పీట వేస్తున్నాయి పార్టీలు. మాస్‌లో మాంచి ఇమేజ్.. లేదంటే క్లాస్‌లో బీభత్సమైన ఫేమ్ ఉంటే చాలు.. వారిని ఒప్పించి మరీ తీసుకొచ్చి ఎన్నికల బరిలో నిలబెడుతున్నాయి పార్టీలు. దీనికి బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్‌లు ఏవీ అతీతం కాదు. అన్ని పార్టీలు ఇదే బాటలో నడుస్తున్నాయి. గతంలో ఎన్నో పాటలు పాడినప్పటికీ ఎందుకోగానీ రాహుల్ సిప్లిగంజ్‌కు పెద్దగా గుర్తింపు అయితే రాలేదు. ఇక బిగ్‌బాస్ విన్నర్ అయ్యాక రాహుల్‌కు కాలం బాగా కలిసొచ్చింది. ఒక్కసారిగా ఆయన రేంజే మారిపోయింది. ఇక ఆర్ఆర్ఆర్‌లో ఆయన పాడిన పాటకు ఆస్కార్ రావడంతో రాహుల్ రేంజ్ మరింత పెరిగింది.
ఇక మాస్‌లో రాహుల్‌కు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ ఆయనను గోషామహల్ బరిలో నిలపాలని యోచిస్తున్నట్టు టాక్. రాహుల్ సిప్లిగంజ్‌కు ఉన్న ఫాలోయింగ్ పార్టీకి ఎంతో కొంత మేలు చేస్తుందని పార్టీ భావిస్తోందని సమాచారం. ఈ క్రమంలోనే ఎప్పటి నుంచో కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతూ వస్తోంది. ఇటీవల రాజీవ్ గాంధీ యూత్ క్విజ్ పోటీల ప్రారంభోత్స వంసందర్భంగా కూడా రాహుల్ సిప్లిగంజ్‌ను కాంగ్రెస్ నేతలు ఆహ్వానించారు. ఇక ఇప్పుడు తాజాగా గోషామహల్ నుంచి పోటీ చేయాల్సిందిగా రాహుల్‌ను కాంగ్రెస్ నేతలు కోరారట. అయితే రాహుల్ దానికి అంగీకరించలేదని తెలుస్తోంది. గోషామహల్ అంటే ఒకరకంగా రాజాసింగ్‌కు అడ్డా. ఆయనను ఎదుర్కోవడం కష్టమని రాహుల్ సిప్లిగంజ్ భావిస్తున్నట్టు తెలుస్తోంది.
ఈ క్రమంలోనే గోషామహల్ అంశాన్ని సున్నితంగా తిరస్కరించిన రాహుల్ సిప్లిగంజ్.. వేరొక నియోజకవర్గాన్ని పరిశీలించాలని కాంగ్రెస్ నేతలను కోరారట. మరి రాహుల్ కోసం పార్టీ నేతలు వేరే స్థానాన్ని పరిశీలిస్తారా? లేదా? అసలు ఈ వార్తల్లో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది. ఇక బీజేపీ నుంచి విజయశాంతి.. ఏకంగా సీఎం కేసీఆర్‌ను ఎదుర్కోబోతున్నారని టాక్. కామారెడ్డి నుంచి పోటీ చేస్తానని విజయశాంతి అధిష్టానాన్ని కోరడం.. అధిష్టానం కూడా సానుకూలంగా ఉందని ప్రచారం జరుగుతోంది. ఇక ఇటీవలే మరో సినీ నటి జయసుధ కూడా పార్టీలో జాయిన్ అయ్యారు. ఇక జయసుధ సికింద్రాబాద్ లేదా ముషీరాబాద్ స్థానాల్లో ఏదో ఒక చోటు నుంచి బరిలోకి దిగే అవకాశం ఉంది. పార్టీలకు సినీ గ్లామర్ ఏ మేరకు కలిసొస్తుందో ఇక చూడాలి.