రెండు పడవల మీద కాళ్లు వేయొద్దంటారు పెద్దలు. ఇది అక్షరాల నిజం. ఇప్పుడు పవన్ కల్యాణ్ చేస్తున్నది ఇదే. ఒకవైపు సినిమాల్లో హీరోగా.. రియల్ లైఫ్‌లో జనసేన పార్టీ అధినేతగా రెండు పడవల మీద కాళ్లు వేశారు. మరికొన్ని నెలల్లో ఏపీలో ఎన్నికలు జరగబోతున్నాయి. ఇప్పటి వరకూ ఎన్ని పడవల మీద కాళ్లేసినా ఓకే కానీ ఇక మీదట మాత్రం పూర్తి ఫోకస్ పొలిటిక్స్ పైనే ఉండాలి. కానీ అది లేదు. మూడు సినిమాలు పూర్తి చేయడం ఒక టార్గెట్ అయితే.. పొలిటిక్స్‌లో రాణించడం ఒక టార్గెట్. ఏదైనా గురి ఒక్కదాని మీద పెడితే ఓకే కానీ ఇలా రెండు కళ్లు రెండింటిపై పెడితే ఎలా అనేది రాజకీయ విశ్లేషకుల భావన. అప్పుడు రెంటికి చెడ్డ రేవడిలా మిగిలిపోవడం తప్ప చేసేదేమీ ఉండదని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
నిజానికి పవన్ అటు సినిమాల్లోనూ.. ఇటు రాజకీయాల్లోనే బాగానే రాణిస్తున్నారు కానీ ఈ సమయంలో అయితే ఒక పాత్ర మరో పాత్రకు నష్టం చేకూరుస్తుంది. అసలు పవన్ రాజకీయాల్లోకి వచ్చిందే... తనకు సినిమాల్లో వచ్చిన స్టార్ డమ్‌తో అనడంలో సందేహం లేదు. కానీ ఇప్పుడు సమయం కేటాయించాల్సింది కేవలం రాజకీయాలకే. ఎన్నికలు పూర్తయ్యాక ఎన్ని సినిమాలు చేసినా కూడా ఇబ్బంది అయితే ఉండదు. కానీ ఇప్పుడు పవన్.. సెప్టెంబర్ 5 నుంచి ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్‌తో పాటు వీలైతే ఓజీ, హరిహరవీరమల్లు సినిమాలను కూడా పూర్తిచేయాలని నిర్ణయించుకొన్నారు. ఈ మూడు సినిమాల షూటింగ్ కంప్లీట్ చేయాలంటే పవన్ క్షణం తీరిక లేకుండా పూర్తి స్థాయిలో షూటింగ్‌పైనే కనీసం రెండు నెలల పాటు ఫోకస్ చేయాల్సి ఉంటుంది.
మరి రెండు నెలల సమయం పాటు పొలిటిక్స్‌ని గాలికి వదిలేస్తే పవన్‌ను ఎవరైనా నమ్ముతారా? ఆయనలో సీరియస్‌నెస్ కొరవడిందనే భావన జనంలో రాదా? ఇప్పుడిప్పుడే వారాహి యాత్రతో జనంలో మంచి గుర్తింపు వచ్చేసింది. జనసేనను జనం అక్కున చేర్చుకున్నారు. ఇలాంటి సమయంలో పొలిటిక్స్‌కు బ్రేక్ తీసుకుని సినిమాలు చేసుకుంటానంటే వినడానికి చాలా బాగోదు. పొత్తుల కసరత్తు ఇంకా తేలనేలేదు. అభ్యర్థుల జాబితాపై ఫోకస్ చేయాలి. ఎన్నికల మేనిఫెస్టోని సిద్ధం చేయాలి. పూర్తి స్థాయిలో జనంలోనే ఉండాలి. ఇవి మాత్రమే ప్రస్తుతం చూసుకోవాలి తప్ప సినిమాలు కాదని రాజకీయ విశ్లేషకుల భావన. పోనీ సినిమా షూటింగ్ స్టార్ట్ చేసుకోమని చెప్పి దానిని గాలికి వదిలేస్తే నిర్మాతలు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుంది. కాబట్టి సినిమాలను వాయిదా వేసుకుని రాజకీయాలపై ఫోకస్ చేస్తే జనసేనకు ఈసారి పొలిటిక్స్‌లో మంచి జరిగే అవకాశం ఉంది.