ఎన్నికలు వస్తున్నాయంటేనే కొన్ని లెక్కలుంటాయి. రాష్ట్రంలోని ఒక పార్టీ ప్రభావం మరొకటి ఎంత ఉంటుందనేది ఒకటైతే.. పక్క రాష్ట్రంలో జరిగిన ఎన్నికల ప్రభావం మన రాష్ట్రంలో ఎంత ఉంటుందనేది మరో లెక్క. కర్ణాటకలో ఎన్నికలు జరిగితే.. తెలంగాణపై ఆ ప్రభావం ఎంత చూపిందనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక ఇప్పుడు హాట్ టాపిక్ ఏంటంటే.. తెలంగాణలో ముందుగా ఎన్నికలు జరుగుతాయి కాబట్టి.. ఈ ఎన్నికల ప్రభావం ఏపీపై ఎంత ఉంటుంది? తెలంగాణ ఎన్నికలకు.. ఏపీ ఎన్నికలకు సంబంధమేంటి? అంటే కావల్సినంత ఉంది. తొలి అడుగు అభ్యర్థుల జాబితాతో మొదలవుతుంది కాబట్టి.. తెలంగాణలో దాదాపు టికెట్లన్నీ తిరిగి సిట్టింగ్‌లకే సీఎం కేసీఆర్ ఇచ్చేశారు. ఇక ఏపీ విషయానికి వస్తే ఇలాంటి పరిస్థితి ఉంటుందా?
జగన్ నమ్ముకున్న ఐ ప్యాక్ టీం అయితే సిట్టింగ్‌లలో 40 మంది పనితీరు బాగోలేదని చెబుతూ ఓ సర్వే రిపోర్ట్‌ను ఆయన చేతిలో పెట్టింది. దానిని జగన్ తన సొంత సర్వే పేరుతో 18కి తీసుకొచ్చారు. దీనికి తోడు ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓటమి పేరుతో ఆల్రెడీ నలుగురికి ఉద్వాసన పలికి బయటకు పంపించేశారు. గన్నవరంలో వల్లభనేని వంశీ కోసం యార్లగడ్డ వెంకట్రావును వదులుకున్నారు. ఇక ఎమ్మెల్సీల్లో కొందరికైనా ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకుంటే జంప్ అవడం ఖాయం. ఇప్పటికే చాలా మంది నేతలు ఏ గట్టున ఉంటారో తెలియక వైసీపీ సతమతమవుతోంది. ఈ లెక్కలన్నింటి మధ్య కేసీఆర్ అప్పజెప్పినట్టు సిట్టింగ్‌లకు టికెట్ అప్పజెప్పడం ఏపీలో అయితే అసాధ్యం.
ఇక ఈ టికెట్ల వ్యవహారాన్ని పక్కనబెడితే తెలంగాణలో బీఆర్ఎస్ గెలిచిందో కేసీఆర్‌ను పట్టుకోవడం ఎవరి తరమూ కాదు. ఏపీలో కూడా తన పార్టీ తరుఫున అభ్యర్థులను బరిలోకి దింపడం ఖాయం. అక్కడ ఒక్క సీటు అయినా గెలుస్తారా? గెలవరా? అనేది పక్కనబెడితే ఓట్లు చీలిపోవడం ఖాయం. అది ఎవరికి మేలు చేస్తుందో.. ఎవరికి చేటు తెస్తుందో ఇప్పుడే చెప్పలేం. పోనీ.. బీఆర్ఎస్ కాదు.. కాంగ్రెస్ గెలిచింది అనుకున్నాం. ఇక ఆ పార్టీ నేతలు ఆగుతారా? రెట్టించిన ఉత్సాహంతో పని చేస్తారు. కనీసం తమ పార్టీ మనుగడను కాపాడుకునేందుకు అయినా యత్నిస్తారు. పార్టీకి దూరంగా ఉంటున్న ఏపీలోని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలంతా రంగంలోకి దిగుతారనడంలో సందేహం లేదు. ఇక ఇలా జరిగినా ఓట్లు చీలుతాయి. ఇక తెలంగాణలో బీజేపీ గెలిచే అవకాశం లేదు కానీ గెలిస్తే ఆ పార్టీ నేతలూ ఆగరు. ఏం జరిగినా కూడా తెలంగాణ ఎన్నికల ప్రభావం ఏపీపై అంతో ఇంతో ఉంటుందనడంలో సందేహం అయితే లేదు.