తెలంగాణలో బయటకు తెలియని రాజకీయమేదో జరుగుతోంది. కర్ణాటక ఎన్నికల ఫలితం తర్వాత తెలంగాణలో బీజేపీ హవా పూర్తిగా పడిపోయింది. అప్పటి నుంచి అసలు రాజకీయం ప్రారంభమైంది. ఇటు మొయినాబాద్ ఫామ్ హాజ్ ఎమ్మెల్యేల ఎర కేసు అడ్రస్ లేదు. అటు ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఎమ్మెల్సీ కవిత అరెస్టూ లేదు. అంతా హాం ఫట్. ఇక మునుగోడు ఎన్నికల్లో వామపక్షాలను వాడుకుని బీఆర్ఎస్ విజయం సాధించింది. ఈ పొత్తు అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కొనసాగుతుందని పలు సందర్భాల్లో బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ చెప్పారు. నిజానికి కేసీఆర్‌కు మాట మీద నిలబడే అలవాటు లేదని అందరికీ తెలిసిందే కానీ పొత్తు విషయంలో ప్లేటు ఫిరాయిస్తారని కమ్యూనిస్టులు కూడా ఊహించలేదు.
అసలు బీజేపీ అంటేనే మండిపడే కేసీఆర్ పక్షం.. ఈ మధ్య కాలంలో సైలెంట్ అయిపోయింది. అప్పుడెప్పుడో ముచ్చింతల్‌లో రామానుజాచార్యుల విగ్రహావిష్కరణ సందర్భంగా సకలం సమకూర్చినా కూడా శిలాఫలకంలో తన పేరు వేయలేదని అలిగి..చినజీయర్ స్వామిని ఆమడ దూరం పెట్టిన కేసీఆర్ ఇప్పుడిప్పుడే అక్కున చేర్చుకుంటున్నారు. ఇక బీజేపీ విషయానికి వస్తే.. బీఆర్‌ఎస్‌తో ఢీ అంటే ఢీ అనేలా బీజేపీని నడిపించిన బండి సంజయ్‌ని అనూహ్యంగా పక్కనబెట్టి సీన్‌లోకి కిషన్ రెడ్డిని తీసుకొచ్చింది. కిషన్‌రెడ్డి ఆది నుంచి బీఆర్ఎస్‌కు ఎదురెళ్లింది లేదు. మరి అలాంటి కిషన్‌రెడ్డి సీన్‌లోకి తెచ్చినప్పటి నుంచే డౌటానుమానాలు ప్రారంభమయ్యాయి కానీ ఏమరుపాటులో వదిలేశారు.
ఇక ఈ రెండు పార్టీలు కలిసి ఉమ్మడి శత్రువైన కాంగ్రెస్‌ను టార్గెట్ చేస్తున్నాయి తప్ప ఒకరిపై మరొకరు విమర్శనాస్త్రాలు సంధించుకుంటున్న దాఖలాలైతే లేవు. అక్కడ పార్లమెంటులో దేశ తొలి ప్రధాని నెహ్రూను బీజేపీ టార్గెట్ చేస్తూ ఏ పాట అయితే పాడుతోందో తాజాగా అదే పాటను అసెంబ్లీలో సీఎం కేసీఆర్ సైతం ఆలపించారు. ఇప్పుడు కదా.. సినిమా అంతా క్లియర్‌గా ప్రేక్షకులు అదేనండి జనాలకు తెలిసొచ్చింది. మొత్తానికి గులాబీ తోటలో సైలెంట్‌గా కమలం విరబోస్తోందంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ బాగా బలపడి బీఆర్ఎస్‌కు మెజారిటీ స్థానాలు దక్కలేదంటే.. కేసీఆర్‌కు మద్దతుగా బీజేపీ రంగంలోకి దిగుతుందని ప్రచారం జరుగుతోంది. దీనికి ఫలితంగా కేసీఆర్ కేంద్రంలో బీజేపీకి వెన్నుదన్నుగా నిలుస్తారట. ఇందులో నిజమెంతుందో కానీ జరుగుతున్న పరిణామాలైతే దీనికి ఊతమిచ్చేలాగే ఉన్నాయి. ఇక ఇప్పుడు బీఆర్ఎస్‌ను ఛీ అనుకుని బీజేపీలో చేరిన వారి పరిస్థితే అగమ్యగోచరంగా మారింది. మొత్తానికి కమలం కారెక్కిందని.. దాని ప్రేమలో కేసీఆర్ మునిగి తేలుతున్నారంటూ ప్రచారం జోరందుకుంది.