మెగాస్టార్ చిరంజీవి పేరు వినగానే అందరికీ మన ఇంట్లో మనిషి అనే ఫీలింగ్ ఉంటుంది. ఆయనని స్ఫూర్తిగా తీసుకుని ఎంతో మంది ఈ రోజు సినిమా ఇండస్ట్రీకి వచ్చారు. స్టార్స్‌గా ఎదిగారు.. ఎదుగుతున్నారు. ఒక సామాన్యుడు కష్టపడి.. ఒక కోటని నిర్మించగలడు అనేదానికి ఉదాహరణగా మెగాస్టార్ చిరంజీవి ఈ రోజు సినిమా ఇండస్ట్రీలో ఎందరికో ఆదర్శంగా నిలిచారు. దాదాపు నాలుగు దశాబ్దాలుగా మకుటం లేని మహారాజుగా ఇండస్ట్రీని ఏలుతున్న ఈ మగధీరుడు.. ఇప్పటికీ తన స్టామినా ఏంటో బాక్సాఫీస్‌కి పరిచయం చేస్తూనే ఉన్నారు. ఆయన పేరు చెప్పుకుని ఇండస్ట్రీకి వచ్చినవారు కొందరైతే.. ఆయన సినిమా పేర్లు పెట్టుకుని ఇండస్ట్రీలో నిలబడేందుకు ప్రయత్నించిన వారు మరికొందరు. మెగాస్టార్ సినిమాలు రికార్డులు క్రియేట్ చేయడం కొత్తేం కాదు.. కానీ ఆయన సినిమాల పేర్లతో ఇతర హీరోలు సినిమాలు తీయడం విషయంలోనే చిరు రికార్డ్ క్రియేట్ చేశారు.
ఇప్పటి వరకు మెగాస్టార్ చిరంజీవి నటించిన సినిమాల పేర్లతో చాలా సినిమాలు రిపీట్ అయ్యాయి. అందులో గ్యాంగ్ లీడర్ అయితే ఒకటి కాదు రెండు సార్లు రిపీట్ అయింది. ఒక్క గ్యాంగ్ లీడర్ మాత్రమే కాదు.. చిరంజీవి నటించిన ఇతర సినిమాల పేర్లు చాలానే రిపీట్ అయ్యాయి. ప్రాణం ఖరీదు, కోతల రాయుడు, ఖాళీ, ఆడవాళ్లు మీకు జోహార్లు, శ్రీరస్తు శుభమస్తు, అభిలాష, రోషగాడు, ఖైదీ, హీరో, జ్వాల, పులి, విజేత, మగధీరుడు, రాక్షసుడు, ఆరాధన, యముడికి మొగుడు, స్టేట్ రౌడీ, యుద్ధభూమి, రాజా విక్రమార్క.. వంటి పేర్లను ఇతర హీరోలు తమ సినిమాలకు పెట్టుకున్నారు.
అయితే ఈ విషయంలోనూ మెగాస్టార్ రికార్డ్ క్రియేట్ చేశారు. అదెలా అంటే.. మరే హీరో సినిమాల టైటిల్స్ ఇన్ని రిపీటెడ్ అవ్వలేదు. ఒక్క మెగాస్టార్‌కి మాత్రమే ఆ ఘనత దక్కింది. దీనిని బట్టి.. ఇండస్ట్రీలో ఇతర హీరోలకు చిరంజీవి అంటే ఎంత ఇష్టమో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికీ ఆయన కొత్తవారిని దగ్గరకు తీసుకునే విధానం, ఇతర హీరోల సినిమాలు హిట్టయితే.. తన సినిమానే హిట్టయినంత ఆనందపడే తీరు.. ఆయనని అందరికీ మరింత దగ్గర చేస్తుంది. అందుకే ఆయన ఇప్పటికీ, ఎప్పటికీ మెగాస్టార్.