ఏపీలో హాట్ టాపిక్‌గా మారిన నియోజకవర్గం గన్నవరం. ఇది ఆది నుంచి టీడీపీకి కంచుకోట. అయితే ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పార్టీ మారినప్పటి నుంచి ఇక్కడి వాతావరణం మరింత ఆసక్తికరంగా మారింది. నిజానికి టీడీపీకి వంశీ వెన్నుముక? లేదంటే వంశీకి టీడీపీ వెన్నుముక అనేది ఇక ఇప్పుడు తేలాల్సి ఉంది. అయితే తాజాగా అప్పటి నుంచి వైసీపీకి అండగా ఉన్న యార్లగడ్డ వెంకట్రావు సైకిల్ ఎక్కడానికి సిద్ధమైపోయారు. వైసీపీలో వంశీ చేరడంతో వీరిద్దరికీ పొసగక యార్లగడ్డ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలోనే చంద్రబాబును కూడా కలిశారు. గన్నవరంలో టీడీపీ భారీ బహిరంగ సభ నిర్వహించడం.. ఉపఎన్నికల్లో వైసీపీ విఫలమవడం.. యార్లగడ్డ టీడీపీలో చేరడం వంటి విషయాలపై ఇప్పటి వరకూ వల్లభనేని వంశీ స్పందికపోవడం ఆసక్తికరంగా మారింది.
తన మాటల దాడితో ప్రత్యర్థులను ఇరుకునపెట్టే వంశీ తన సొంత నియోజకవర్గంలో చకచకా జరిగిపోతున్న పరిణామాలపై కనీసం పెదవి విప్పడం లేదు. ఇది ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. 2004కు ముందు పరిటాల రవి అనుచరుడిగా ఉన్న వల్లభనేని వంశీ 2004లో నేరుగా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. తొలిసారి విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. కానీ ఓటమి పాలయ్యారు. ఆ తరువాత జరిగిన కొన్ని పరిణామాల నేపథ్యంలో వంశీని చంద్రబాబు పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఇక 2014లో గన్నవరం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి అప్పటి వైసీపీ అభ్యర్థి డాక్టర్ దుట్టా రామచంద్రరావుపై, 2019లో యార్లగడ్డపై పోటీ చేసి విజయం సాధించారు.
టీడీపీ నుంచి పోటీ చేసి విజయం సాధించిన వంశీ ఆ తరువాత వైసీపీలోకి వెళ్లిపోయారు. ఆ తరువాత ఆయన అనుచరులు కొందరు తప్ప టీడీపీ కార్యకర్తలెవరూ ఆ పార్టీలోకి వెళ్లింది లేదు. అయితే వంశీ.. చంద్రబాబు సతీమణి భువనేశ్వరిపై చేసిన వ్యాఖ్యలు పెను దుమారాన్ని రేపాయి. టీడీపీ కార్యకర్తల నుంచి ఆయనపై తీవ్ర ఆగ్రహావేశాలు వెల్లువెత్తాయి. నిజానికి ఈ వ్యాఖ్యలు ఆయనకి చాలా మైనస్ అయ్యాయి. ఆ తరువాత క్షమాపణ చెప్పినా కూడా జరగాల్సిన నష్టం అప్పటికే జరిగిపోయింది. ఇదంతా గతం. అసలు ఇప్పుడు వంశీ ఎందుకు నోరు మెదపడం లేదనేది హాట్ టాపిక్. నియోజకవర్గ నేతలు, ప్రజలు సైతం ఈ పరిణామాలపై వంశీ ఎలా స్పందిస్తారు? అసలు ఏ విధంగా మాట్లాడతారనేది తెలుసుకోవాలని చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు.